MAD | సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ‘మ్యాడ్’ చిత్రం ఆద్యంతం చక్కటి హాస్యంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ముఖ్యంగా యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. నార్నే నితిన్, సంగీత్శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్ని పోషించిన ఈ వినోదాత్మక చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్కేర్’ రానున్న విషయం తెలిసిందే. బుధవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మ్యాడ్గ్యాంగ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. తొలి భాగానికి భిన్నంగా వారి వేషధారణ, లుక్స్ కనిపించడం ఆసక్తినిరేకెత్తిస్తున్నది.
మ్యాడ్ గ్యాంగ్‌ను ఈ సీక్వెల్లో సరికొత్తరీతిలో పరిచయం చేయబోతున్నామని, తొలిభాగం కంటే రెండింతల వినోదంతో మెప్పిస్తుందని, ఈ నెల 20న తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. ‘మ్యాడ్’ సినిమాకు పనిచేసిన దర్శకుడు, సాంకేతిక నిపుణులందరూ ఈ సీక్వెల్‌కు పనిచేస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, హారిక సూర్యదేవర, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.