Maa Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన కనబరుస్తుంది. విడుదలైన తొలి వారంలోనే ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూ సమంత కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాల కలయికతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ.55.71 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. భారతదేశంలో రూ.33.20 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేయగా, దేశీయ గ్రాస్ వసూళ్లు రూ.38.36 కోట్లకు చేరుకున్నాయి.
విడుదలైన ఆరో రోజున కూడా సినిమా మంచి వసూళ్లు సాధించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర జోరు కొనసాగుతోంది. విదేశీ మార్కెట్లలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఓవర్సీస్లో ఈ చిత్రం రూ.17.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు సూచిస్తున్నాయి.ఆరో రోజున ఒక్క రోజులోనే విదేశీ మార్కెట్ల నుంచి రూ.కోటికి పైగా వసూళ్లు రావడం విశేషం. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే మార్కెట్లలో సినిమాకు మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.మంగళవారం, బుధవారం రోజుల్లో తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. మొత్తం 2,230 షోల ద్వారా సుమారు రూ.2.35 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
ఇక తమిళ వెర్షన్ నుంచి రూ.15 లక్షలు, కర్ణాటకలో రూ.42 లక్షలు, తమిళనాడులో రూ.25 లక్షలు, కేరళలో రూ.2 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.5 లక్షల మేర కలెక్షన్లు నమోదయ్యాయి. చాలా కాలం తర్వాత సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా యాక్షన్, ఫ్యామిలీ, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని ప్రమాదాల నుంచి ఎలా కాపాడుకుంది? ఆమె గతం ఏమిటి? కుటుంబం కోసం ఆమె చేసిన పోరాటం ఎలా సాగింది? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఈ చిత్రానికి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, కథను రాజ్ నిడిమోరు అందించినట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.