Hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో ప్రముఖ సినీ నటి హేమ (hema)ను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసిందే. పోలీసులు ఇటీవలే హేమకు మూడోసారి నోటీసులు జారీ చేసి.. విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హేమను సస్పెండ్ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ నిర్ణయం తీసుకుంది. మా కమిటీ హేమ సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రేపు మా అధ్యక్షుడు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
గత నెల 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు నిర్దారించారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హేమ వెళ్లలేదని తెలిసిందే. హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ.. తాను వెళ్లలేదంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసింది. కానీ పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకే విధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చారు పోలీసులు.