Dulquer Salmaan | ‘తెలుగు పరిశ్రమతో నాకు అనుబంధం ఏర్పడిపోయింది. ఇక్కడి ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు. ఈ బంధం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. దర్శకుడు నాగ్ అశ్విన్, స్వప్నదత్ ఇద్దరు తొలుత ‘మహానటి’కోసం నన్ను కలిశారు. అప్పుడు నాకు తెలుగు రాదు. కానీ ఆ రోజు వారిద్దరూ నన్ను మీ ముందు నిలబెట్టారు. ఆ తర్వాత హను రాఘవపూడి ‘సీతారామం’తో గుర్తుండిపోయే విజయాన్నిచ్చారు. ఇప్పుడు వెంకీ అట్లూరి. చూడ్డానికి కుర్రాడిలా ఉంటాడు కానీ.. ప్రతిభావంతుడు. ఇందులోని ప్రతి పాత్రకూ తను ప్రాణం పోశాడు. వెంకీతోపాటు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా.’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు.
ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘లక్కీభాస్కర్’. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన దిల్‌రాజు, దర్శకులు నాగ్అశ్విన్, హను రాఘవపూడి చిత్ర యూనిట్‌కి అభినందనలు అందించారు. ‘మా ‘లక్కీభాస్కర్’తో పాటు దీపావళికి విడుదలైన సినిమాలన్నీ విజయం సాధించడం ఆనందంగా ఉంది. దుల్కర్‌తో పనిచేయాలనే కోరిక ‘లక్కీభాస్కర్’తో తీరింది. సింగిల్ సిట్టింగ్‌లో కథ ఓకే చేశారాయన. మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, సాయికుమార్, కసిరెడ్డి ఇలా అందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసి సినిమాను నిలబెట్టారు. టెక్నీషియన్స్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు.’ అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. ఇంకా కథానాయిక మీనాక్షి చౌదరి, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, నటుడు సాయికుమార్ తదితరులు కూడా మాట్లాడారు.