“ఆర్య’ కథ విన్నప్పుడు ఎలాంటి ఫీల్ కలిగిందో ఈ సినిమా కథ విన్నప్పుడు కూడా అలాంటే భావనే కలిగింది. ఇదొక న్యూఏజ్ లవ్‌స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు సినిమా రాలేదు’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. గురువారం జరిగిన ‘లవ్ మీ’ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. ప్రతి సన్నివేశంలో కొత్తదనం ఉంటుంది’ అన్నారు. ప్రేమను సరికొత్త కోణంలో ఆవిష్కరించే వినూత్న కథ ఇదని హీరో ఆశిష్ తెలిపారు. ఇలాంటి కథను ఇప్పటివరకు వినలేదని, ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కథానాయిక వైష్ణవి చైతన్య పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, సంగీతం: కీరవాణి, నిర్మాణ సంస్థ: దిల్‌రాజు ప్రొడక్షన్స్.