Prabhas | రిలీజ్ డేట్లు పక్కన పెడితే అత్యంత వేగంగా సినిమాలు చేస్తుంది ప్రభాస్ మాత్రమే అని బల్లగుద్ది చెప్పొచ్చు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో మూడు సినిమాలు ఏకకాలంలో రూపొందుతున్నవే. అవి కూడా ఆశా మాశీ ప్రాజెక్ట్‌లు కాదు. ఇక ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాగా ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడు జాయిన్ అయ్యాడు. అతనే లోకేష్ కనగరాజ్.
ఇండియన్ సినిమా చరిత్రలో హాలీవుడ్ తరహాలానే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన ఘనత లోకేష్ కనగరాజ్‌దే. మానగరం నుంచి మొదలుకుని విక్రమ్ వరకు ప్రతీది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కినవే. విజయ్‌తో చేసిన ఒక్క మాస్టర్ మినహాయించి మిగిలిన మూడు సినిమాలు LCUలోనివే. ఇక ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న లియో సైతం LCUలో భాగంగా తెరకెక్కిందేనని ఇన్సైడ్ టాక్. కాగా ఈ దర్శకుడు తన కెరీర్లో కేవలం 10 సినిమాలు మాత్రమే చేస్తానని, ఆ తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టేసి ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా ఫిక్స్ అయిపోతానని ఎన్నో ఇంటర్వూల్లో తెలిపాడు.
కాగా తాజాగా లోకేష్ లియో ప్రమోషన్లో భాగంగా తన నెక్ట్స్ లైనప్ గురించి చెప్పాడు. అందులో ప్రభాస్‌తో కూడా సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా ప్రభాస్‌తో చేయబోయేది LCUలో ఎండ్ గేమ్ అని తెలిపాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. చివరి సినిమా ప్రభాస్‌తో ముగిస్తాడు అంటే అది ఏ రేంజ్లో ఉండబోతుందోనని అప్పుడే ఊహల్లో తేలిపోతున్నారు. నిజానికి లోకేష్ సినిమా కథలు మరీ కొత్తగా కూడా ఏమి ఉండవు. కానీ తన స్క్రీన్‌ప్లే మాయజాలంతో జనాలను కట్టిపడేస్తాడు. హీరోలకు ఓ రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చి ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తాడు.