Lokesh Kanagaraj Coolie |సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ (Coolie). పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు దర్శకుడు లోకేష్. ఇందులో భాగంగా తాను రెండేండ్లుగా ‘కూలీ’ తప్ప వేరే ఆలోచన పెట్టుకోలేదని తెలిపాడు.
గత రెండు సంవత్సరాలుగా ‘కూలీ’ తప్ప తనకు వేరే ఏ ఆలోచన లేదని తెలిపారు. తన స్నేహితులు, కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ఈ సినిమా కోసమే అంకితభావంతో పనిచేశానని చెప్పుకోచ్చాడు. ఈ సినిమాపై ఎటువంటి ప్రభావం పడకూడదన్న ఉద్దేశ్యంతో రెండు పుట్టినరోజులు కూడా జరుపుకోలేదని, సోషల్ మీడియాకు కూడా పూర్తిగా దూరంగా ఉన్నానని లోకేశ్ వెల్లడించారు. గతంలో విజయ్ హీరోగా వచ్చిన ‘లియో’ సినిమాను వేగంగా పూర్తి చేయాలన్న తొందరలో కొన్ని విషయాలను పట్టించుకోలేదని, అలాంటి తప్పు మళ్లీ ‘కూలీ’తో జరగకూడదని తాను చాలా జాగ్రత్త పడ్డానని లోకేశ్ కనగరాజ్ తెలిపారు.
ఈ చిత్రంలో రజనీకాంత్ ‘కూలీ నంబర్ 1421’గా దేవా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, నాగార్జున, ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే ఒక ఐటమ్ సాంగ్‌లో ఊరమాస్‌గా అలరించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే, రజినీకాంత్, ఆమిర్ ఖాన్ కాంబినేషన్ 29 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి రానుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఆతంక్ హీ ఆతంక్’ (1995) చిత్రంలో నటించారు. ‘కూలీ’ 100 కంటే ఎక్కువ దేశాలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.