OTT | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా నిర్మించిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ చిత్రం ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. చంద్ర, డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు కీలక పాత్రలు పోషించగా, షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ నిమిష్ రవి, చమన్ చాకోలు అందించారు. హార్రర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సృష్టించిన చిత్రానికి డీటీఎస్, వీఎఫ్ఎక్స్ వంటి ఆధునిక సాంకేతికతలకు భారీగా ఖర్చుపెట్టారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమా మొత్తం బడ్జెట్ సుమారు 65 కోట్లు అయినట్టు సమాచారం. ట్రేడ్ వర్గాల ప్రకారం, సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 50 కోట్లు షేర్, 100 కోట్లు గ్రాస్ అవసరమని అంచనా వేయగా, మూవీ అంచనాలను మించి రాణించింది. ఇండియా థియేట్రికల్ కలెక్షన్స్ పరంగా చూస్తే.. తొలి రోజు: 2.7 కోట్లు, తొలి వారం: 54.7 కోట్లు, రెండో వారం: 47 కోట్లు, మూడో వారం: 27.1 కోట్లు, నాలుగో వారం: 13.25 కోట్లు, ఐదో వారం: 9.8 కోట్లు, ఆరో వారం: రూ.95 కోట్లు. మొత్తంగా 154.8 కోట్లు నెట్, 181.3 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
నార్త్ అమెరికా, యూఏఈ, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కలిపి 119.3 కోట్లు వసూలు చేశారు. ఈ మార్కెట్లో మలయాళ చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది.ఇండియా + ఓవర్సీస్ కలిపి 302 కోట్లు గ్రాస్ సాధించి, భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం విడుదలై 50 రోజులు కావొస్తుంది. ఎప్పుడు ఓటీటీలోకి చిత్రం వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం జియో హాట్ స్టార్ ఓటీటీ హక్కులని దక్కించుకుంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది.