Missing Meghana | టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలతో పాటు సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోన్న తాజా థ్రిల్లర్ చిత్రం “మిస్సింగ్ మేఘన”. ఫస్ట్ కాపి మూవీస్ మరియు కేడి & కో సంయుక్త బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మరింత జోరందుకున్నాయి.
సినిమాలోని ఫస్ట్ సింగిల్ అయిన “పిల్ల పిల్ల పిల్ల” లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను టాలీవుడ్ ప్రముఖ లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు అత్యంత ఘనంగా ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుకకు నైపుణ్యం కలిగిన సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు మరియు నిర్మాత బెక్కం వేణుగోపాల్ హాజరయ్యారు. సురేష్ బాబు తన గోల్డెన్ హ్యాండ్‌తో పాటను విడుదల చేసి చిత్ర బృందానికి ఘన విజయం సాధించాలని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, సురేష్ ప్రొడక్షన్స్ కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేక స్థానం గురించి కొనియాడారు. తమ సినిమా ఫస్ట్ సాంగ్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని, నన్ను నమ్మి అవకాశం కల్పించిన నిర్మాత నరేష్ బాబుకు, కో-ప్రొడ్యూసర్ శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో అద్భుతమైన పాటలు అందించిన సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్‌కు మరియు ఈ పాటకు ప్రాణం పోసిన ప్రముఖ గాయకుడు జావేద్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నిర్మాత నరేష్ బాబు మాట్లాడుతూ, తమ సినిమా ప్రారంభోత్సవం కూడా రామానాయుడు స్టూడియోలోనే జరిగిందని, ఇప్పుడు అదే స్టూడియోలో లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా మొదటి పాట విడుదల కావడం సెంటిమెంట్‌గా చాలా సంతోషాన్నిస్తోందన్నారు. గతంలో వచ్చిన ‘తంత్ర’ సినిమా మ్యూజికల్ ఎంతటి విజయం సాధించిందో, ఈ సినిమా సంగీతం మరియు కథ కూడా అంతకంటే గొప్ప విజయాన్ని అందుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్.ఆర్. ధృవన్ స్వయంగా సాహిత్యం అందించి, సంగీతం సమకూర్చి, జావేద్ అలీ చేత పాడించిన ఈ పాట శ్రోతలను ఇతరులకు భిన్నమైన లోకంలోకి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, తన సినీ ప్రయాణం రామానాయుడు స్టూడియో నుంచే ప్రారంభమైందని, అలాంటి పవిత్రమైన వేదికపై సురేష్ బాబు చేతుల మీదుగా పాట విడుదల కావడం తన అదృష్టమని తెలిపారు. దర్శకుడు వాచస్పతి ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన సీట్-ఎడ్జ్ థ్రిల్లర్‌గా మలిచారని, ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని తెలిపారు.
సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ, ఈ బ్యానర్లో తాను చేస్తున్న రెండవ సినిమా ఇదనీ, తానే స్వయంగా పాట రాసి, సంగీతం అందించి, తన ఫేవరెట్ సింగర్ జావేద్ అలీతో పాడించడం మరపురాని అనుభూతి అని తెలిపారు. చక్కని థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులందరినీ ఖచ్చితంగా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం శామ్. కె. నాయుడు అందించగా, కథ & స్క్రీన్‌ప్లే వనరాజ్, సంభాషణలు వెంకట్ బద్దిగం అందించారు. ఎడిటింగ్ బాధ్యతలు బసవా చూసుకోగా, కొరియోగ్రాఫర్‌గా జేడీ మరియు ఈశ్వర్ పెంటి, ఫైట్స్ మాస్టర్లుగా రామకృష్ణ, స్టంట్ శంకర్ వ్యవహరించారు. పి.ఆర్.వోలుగా సోమిశెట్టి నాగేశ్వర రావు (SNR), తిరుమలశెట్టి వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.