Lal Salam | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) లీడ్ రోల్లో నటించిన ‘లాల్ సలాం’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నది.
అయితే సినిమా థియేటర్లలోకి వచ్చి 16 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బక్రీద్ పండుగ కానుకగా జూన్ 6 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఎదురుచూపులకు తెర పడిందంటూ ఒక పోటస్టర్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా రూ.52 కోట్లు వసూలుచేసి భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అప్పట్లోనే నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సినిమా విడుదల సమయంలో నెట్‌ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ డీల్‌ను రద్దుచేసుకుంది. ఈ నేపథ్యంలో లాల్ సలామ్ ఓటీటీ విడుదల ఆలస్యమైంది.
లాల్ సలామ్ కథ మొత్తం 1990ల కాలంలో నడుస్తుంది. హిందూ ముస్లింలు ఐకమత్యంగా సోదరభావంతో మెలిగే ఊరు కసుమూరు. అక్కడినుంచి ముంబై వెళ్లి గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడు మొయిదీన్ భాయ్ (రజనీకాంత్). ఆయన షంషిద్దీన్ (విక్రాంత్), గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్) స్నేహితులు. షంషీని క్రికెటర్‌ను చేయాలన్నది మొయిద్దీన్ కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్ – ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలవుతుంది. దీంతో షంషుద్దీన్ చేతిని గురు నరికేస్తాడు. అయితే గురు.. మొయిదీన్ ప్రాణ స్నేహితుడు (ఫిలిప్ లివింగ్‌స్టోన్) కుమారుడు. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది? క్రికెట్లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? అన్నది మిగతా కథ.