Laapataa Ladies | చిన్న సినిమాగా విడుదలై బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన ఈ సినిమాకు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) దర్శకత్వం వహించింది. శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా నితాన్షి గోయల్, ప్రతిభ రంట హీరోయిన్లుగా నటించారు. భోజ్పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే ఈ సినిమా ఒరిజినల్ కాదని తాజాగా విమర్శలు వస్తున్నాయి. అరబిక్ సినిమాను కాపీ కొట్టి ఈ సినిమాను తీశారంటూ నెటిజన్లు కిరణ్ రావుని ట్రోల్ చేస్తున్నారు.
2019లో అరబిక్ భాషలో విడుదలైన చిత్రం ‘బుర్ఖా సిటీ’ (Burqa City). ఈ సినిమాను ఫాబ్రిస్ బ్రాక్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో హీరోకి కొత్తగా పెళ్లి అవ్వగా.. బుర్ఖా ధరించడం వల్ల అతడి భార్య అనుకోని వేరే అమ్మాయిని భార్యగా తన ఇంటికి తీసుకుపోతాడు. ఇంటికి వచ్చాక బుర్ఖా తీసిన అనంతరం అసలు నిజం తెలుస్తుంది. దీంతో తన భార్య మిస్ అయ్యిందని పోలీసులకు కంప్లయింట్ ఇస్తాడు. అయితే తన భార్యను చివరికి ఎలా కనుగొన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. అయితే లాపతా లేడిస్ కథ కూడా అచ్చం ఇలాగే ఉండడంతో నెటిజన్లు ఈ సినిమాను కాపీ కొట్టారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ విషయంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
లాపతా లేడీస్ సినిమా విషయానికి వస్తే.. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రాగా దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత కిరణ్ రావ్ మెగాఫోన్ పట్టింది. ఆమె చివరగా 2010లో దోబీ ఘాట్ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది.