Laalo Trailer | సినిమా రంగంలో అప్పుడప్పుడు కొన్ని చిన్న చిత్రాలు అద్భుతాలు సృష్టిస్తుంటాయి. భారీ స్టార్ కాస్ట్, వందల కోట్ల ఖర్చు లేకపోయినా.. కేవలం బలమైన కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించవచ్చని నిరుపిస్తాయి. అయితే ఈ కోవలోనే వచ్చిన గుజరాతీ చిత్రం ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ (Lalo – Krishna Sada Sahayate). కేవలం 50 లక్షల రూపాయల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన నాటి నుంచే థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో గుజరాత్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. గుజరాతీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా ఇది అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
అయితే గుజరాత్లో సాధించిన ఈ భారీ విజయాన్ని చూసి బాలీవుడ్ సైతం విస్తుపోయింది. దీంతో సినిమాలోని కంటెంట్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ‘లాలో’ హిందీ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి హిందీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. జనవరి 09న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి అంకిట్ సఖియా దర్శకత్వం వహించగా, జాతీయ అవార్డు గ్రహీత మానసి పరేఖ్ నిర్మాతగా వ్యవహరించారు. కారన్ జోషి కథానాయకుడిగా నటించగా, రీవా రాచ్ కథానాయికగా మెప్పించారు. శ్రుహద్ గోస్వామి కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్ర కథానాయకుడు (కారన్ జోషి) ఒక ఆటో డ్రైవర్. అతను ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అంతేకాక గతంలో జరిగిన కొన్ని విషయాలు అతడిని వెంటాడుతుంటాయి, ఆ బాధ నుంచి అతను ఎప్పుడూ బయటపడలేకపోతుంటాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక రోజు ఆ ఆటో డ్రైవర్ ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోతాడు. బయటికి రావడానికి అతను అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాదు. సరిగ్గా ఆ సమయంలోనే అతడికి మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. శ్రీకృష్ణుడు తన అద్భుతమైన లీలలు, మాటల ద్వారా ఆ ఆటో డ్రైవర్‌ను ముక్తి మార్గం వైపు నడిచేలా చేస్తాడు. శ్రీకృష్ణుడి అండదండలతో ఆ డ్రైవర్ తన గతం తాలూకూ బాధలు, తన మనసులోని అలజడిని అధిగమిస్తాడు. కొత్త ఆశలు, ధైర్యంతో జీవితంలో ముందుకు సాగడం ప్రారంభిస్తాడు. ఒక ఆటో డ్రైవర్ జీవితంలో దైవ శక్తి జోక్యం, భక్తి, స్నేహంతో అతను ఎలా మార్పు చెందాడు అనేదే ఈ ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ చిత్ర కథాంశం. ఈ భావోద్వేగపూరితమైన కథే సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.