కుట్రం పురిందవన్
సోనీ లివ్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: పశుపతి, విదార్థ్, లిజ్జీ ఆంటోనీ, లక్ష్మీ ప్రియ చంద్రమౌళి, అజిత్ కోషీ, మున్నార్ రమేష్ తదితరులు
దర్శకత్వం: సెల్వమణి
థ్రిల్లర్ జానర్ కథలను ఓటీటీలు అందలం ఎక్కిస్తున్నాయి. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రేక్షకులూ వీటికి బ్రహ్మరథం పడుతుండగా.. రికార్డు వ్యూస్‌తో కాసులు కురిపిస్తున్నాయి. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన వెబ్ సిరీస్.. కుట్రం పురిందవన్. సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులో ఉన్నది. ఇటీవలే స్ట్రీమింగ్కు వచ్చి.. రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతున్నది. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా వచ్చిన ఈ సిరీస్.. అనూహ్యమైన మలుపులతో ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. కథలోకి వెళ్తే.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేసే భాస్కర్ (పశుపతి)ది మధ్యతరగతి కుటుంబం. అతని మనవడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటాడు.
స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని, వచ్చిన డబ్బుతో మనవడికి చికిత్స చేయించాలని అనుకుంటాడు భాస్కర్. వీళ్ల పొరుగునే ఎస్తేర్ (లక్ష్మీ ప్రియ చంద్రమౌళి) కుటుంబం నివసిస్తుంది. ఆమె భర్త ఎప్పుడూ ఎస్తేర్‌ను వేధిస్తూ ఉంటాడు. వీరి కుమార్తె మెర్సీ. బిడ్డ భవిష్యత్తు కోసమే అన్నిటినీ భరిస్తూ ఉంటుంది ఎస్తేర్. భాస్కర్ కుటుంబానికి, ఎస్తేర్ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. మరోవైపు పోలీసు అయిన గౌతమ్ (విదార్థ్)ది మరో కథ. ఉద్యోగంలో ఎంతో నిజాయతీగా ఉండే గౌతమ్.. అనుకోని చిక్కుల్లో పడతాడు. విధుల నుంచి సస్పెన్షన్‌కు గురవుతాడు.
ఎలాగైనా తన నిజాయతీని నిరూపించుకోవాలని భావిస్తుంటాడు. ఇలా ఉండగా.. గ్రామంలో జరిగే ఓ ఉత్సవం సందర్భంగా ఎస్తేర్ భర్త చనిపోయి కనిపిస్తాడు. మెర్సీ కూడా మిస్ అవుతుంది. దాంతో గ్రామంలో కలకలం రేగుతుంది. ఆమె కోసం వెతుకుతుండగా.. ఓ ప్రదేశంలో స్పృహ లేకుండా పడి కనిపిస్తుంది. ఆమెపై ఎవరో అత్యాచారం చేసిన ఆనవాళ్లు కూడా ఉంటాయి. దాంతో, పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. పక్కింట్లో ఉండే భాస్కర్‌ను అనుమానిస్తారు.
ఎలాంటి సమస్యల్లో తలదూర్చని భాస్కర్‌కు.. ఈ కేసు మెడకు చుట్టుకుంటుంది. మరోవైపు మనవడికి సర్జరీ చేయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో భాస్కర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ఏం చేస్తాడు? మెర్సీ తండ్రిని చంపి, ఆమెపై అఘాయిత్యం చేసిందెవరు? గౌతమ్ తన నిజాయతీని నిరూపించుకుంటాడా? మెర్సీ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేస్తారు? అనేది తెలియాలంటే.. సిరీస్ చూడాల్సిందే.