Kubera | ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం కుబేర. జూన్ 20న విడుదల కానున్న ఈ సినిమా గత కొద్ది రోజులుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన `కుబేర` ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. `కుబేర` చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది.ఇక గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో `కుబేర` ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా డబ్బు, పవర్ చుట్టూ తిరుగుతుందని, దానికోసమే ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ సినిమాలోని కీలక అంశాలను, పాత్రల తీరుతెన్నులను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రెట్టింపు చేశారు. `కోట్లు కోట్లు కోట్లు అంటే ఎంత సార్` అని ధనుష్ చెప్పడం, `ఆయిల్ అంటే సాధారణ విషయం కాదు, మనందరి తొక్క తీసి పదవి నుంచి తీసేసే పవర్ ఫుల్ మిషన్` అని విలన్లు మాట్లాడుకోవడం, `ఈ దేశంలో డబ్బు, పవరే పని చేస్తాయి, నీతి న్యాయాలు కాదు, ఇది చరిత్ర` అని నాగార్జున చెప్పడం, ఆయన్ని పోలీసులు తీసుకెళ్లడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
వాళ్ల మీద చేయి వేయడానికి లేదు అని, నా పేరు దీపక్ అని ధనుష్‌ని నాగార్జున పరిచయం చేసుకోవడం, బిచ్చగాడిని తీసుకొచ్చి పెద్ద ప్యాలెస్‌లో ఉంచి రాజభోగాలు కల్పించడం, ఆ తర్వాత అమ్మ అమ్మ అంటూ ధనుష్.. రష్మిక వెంట పడటం, ఆమె ఎందుకురా నా వెంట పడుతున్నావని చెప్పడం, అనంతరం ధనుష్ గాయాల పాలు కావడం, మీరు తప్ప నాకు ఎవరూ తెలియదు మేడం అని ఆయన అనడం ఆసక్తిని పెంచాయి. ముష్టివాడు ప్రభుత్వాన్నే రిస్క్ లో పడేశాడని విలన్లు మాట్లాడుకోవడం, నాగార్జున టెన్షన్ పడటం, అనంతరం తాను అక్కడే తేల్చుకుంటానని ధనుష్ మళ్లీ వెళ్లిపోయి ముష్టివాడిగా మారడం, దేవుడిని పూజించడం ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కథని దర్శకుడు ఏ విధంగా తీసుకెళతాడనే ఆసక్తి అందరిలో ఉంది. విజువల్ పరంగా బాగుంది. శేఖర్ కమ్ముల తన సినిమాని ట్రైలర్ లోనే చెప్పేస్తారు. కానీ `కుబేర` విషయానికి వస్తే ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది.