Kubera | జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం కుబేర. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నలు కీలకపాత్రలు పోషించారు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద మెల్లగా మొదలై ఆ తర్వాత స్ట్రాంగ్‌గా నిలిచిన ఈ క్రైమ్ డ్రామాకు యూనానిమస్‌గా పాజిటివ్ టాక్ రావడంతో, మంచి వసూళ్లే వచ్చాయి. వర్కింగ్ డేస్ లో కలెక్షన్లు కొద్దిగా నెమ్మదించిన, రెండో వీకెండ్లో మళ్ళీ జోరందుకుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆదరణ లభించగా, తమిళనాడులో మాత్రం తొలి వారం తర్వాత గ్రాఫ్ మెల్లమెల్లగా దిగుతూ వచ్చింది. దాంతో కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళ వర్షన్లో వచ్చిన నష్టాలను తెలుగు వర్షన్ నుంచే కవర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరల్డ్ వైడ్‌గా 16వ రోజున బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడంతో సినిమా విజయం సాధించినట్టైంది. కొన్ని ఏరియాల్లో చిన్నపాటి నష్టాలు వచ్చినప్పటికీ, ఓవరాల్‌గా సినిమా ‘క్లీన్ హిట్’గా నిలిచింది. ఈ వారం పెద్దగా పోటీ సినిమా ఏదీ లేకపోవడంతో, కుబేరా తిరిగి ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.
ఈ వారాంతంలో కూడా కుబేరకు ప్రేక్షకుల స్పందన బాగుండటంతో, సినిమా మరో వారం వరకు స్టడీగా కలెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే, కుబేర నిర్మాతలకు మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. తమిళనాట నష్టాలను కవర్ చేసుకుంటూ, తెలుగు మార్కెట్ లో మాస్ హిట్ గా నిలిచిన కుబేర, 16 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని విజయవంతమైన సినిమాగా నిలిచింది. ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లో అత్యంత సహజమైన లోకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. పర్పెక్షన్కు ప్రాణం ఇచ్చే ధనుష్ డంపింగ్ యార్డ్ సీన్ కోసం ఎంతో కష్టపడ్డారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు.