Balagam | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సినీ చరిత్రలోనే ‘బలగం’ సినిమా మైలురాయిగా నిలిచి, మూడు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హర్షం వ్యక్తంచేశారు. బలగం సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి అవార్డులు లభించిన నేపథ్యంలో ఈ సినిమా డైరెక్టర్ వేణు యెల్దండితోపాటు సినీ యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని నేత కార్మిక కుటుంబానికి చెందిన వేణు యెల్దండి కష్టపడి ఎదిగి ‘బలంగం’ అనే గొప్ప సినిమాను తీశారని కొనియాడారు.
రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా తీసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. వేణుతోపాటు అతని టీం కష్టానికి దకిన ఫలితం ఈ ఫిలింఫేర్ అవార్డులని అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ‘పిట్ట ముట్టుడు’ ఇతివృత్తంతో తీసిన ‘బలగం’ సినిమా కొట్లాది తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచింది. చిన్న బడ్జెట్‌తో తీసిన బలగం సినిమా రూ.40 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో భారీస్రీన్లు పెట్టి ఈ సినిమాను ప్రదర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. గ్రామ చావడి వద్ద గ్రామస్థులంతా కలిసి కొన్ని ఏండ్ల తర్వాత చూసిన సినిమా ‘బలగం’ అని పేర్కొన్నారు.
‘బలగం’ సినిమా ఎకడో తీయడం ఎందుకు రాజన్న-సిరిసిల్ల జిల్లాలో అద్భుతమైన లోకేషన్లు ఉన్నాయి. మన దగ్గరే తీయండి. అన్ని విధాల సహకరిస్తా’ అని చిత్ర దర్శకుడు వేణుకు కేటీఆర్ అభయం ఇచ్చారు. టెసాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌కు ఈ సినిమా నిర్మాత దిల్‌రాజు కూడా సన్నిహితుడు కావడంతో సిరిసిల్లలో ఈ సినిమా మొత్తం షూట్ చేశారు. కోనసీమను తలపించే పచ్చని పొలాలు.. మెట్టప్రాంతమైన సిరిసిల్లలో కూడా ఉన్నాయా? అని ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు అప్పట్లో కాళేశ్వరం జలాల గొప్పతనాన్ని చర్చించుకున్నారు.
సినీ షూటింగ్ మాత్రమే కాకుండా కేటీఆర్ సూచన మేరకు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా సిరిసిల్లలోనే నిర్వహించడం విశేషం. ఒక సినిమా ఫంక్షన్ చిన్న జిల్లా కేంద్రంలో నిర్వహించడం తెలుగు సినీచరిత్రలోనే ఇదే మొదటిదని చెప్తున్నారు. మంత్రిగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, నాడు కేటీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరై శుభాకాంక్షలు తెలియజేయడం మరో విశేషం. మరోవైపు నాడు అసెంబ్లీ సాక్షిగా ‘బలగం’ సినిమా విశేషాలను కేటీఆర్ ఉదహరించిన సందర్భాలున్నాయి.
సౌతిండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘బలగం’ ఉత్తమ చిత్రంగా నిలవడంతోపాటు పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కి ఆయన శుభాకాంక్షలు అందించారు.