ప్రభాస్ నటిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో భాగం కావడం ఓ జీవితకాలపు అనుభవమని చెప్పింది కథానాయిక కృతిసనన్. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండగా, కృతిసనన్ ఆయన సరసన సీత పాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర విశేషాల గురించి కృతిసనస్ చెబుతూ ‘తొలిసారి ప్రభాస్‌ను సెట్లో కలిసినప్పుడు ఆయన చాలా సిగ్గరిగా అనిపించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన అసలు వ్యక్తిత్వం తెలిసింది. సెట్లో ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటాడు. తెలుగులో నేను చెప్పే సంభాషణల్లో తప్పులుంటే సరిదిద్దేవాడు. గొప్ప స్టార్డమ్ కలిగిన హీరో అయినప్పటికీ అందరితో వినమ్రంగా మసలుకోవడం ఆయనలోని మంచి లక్షణం’ అని చెప్పింది. ఇక సినిమా సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతున్నదని, గ్రాఫిక్ వర్క్ కీలకంగా ఉంటుందని పేర్కొంది. ‘భారీ బడ్జెట్ సినిమాను చిన్న చిన్న సెట్స్‌లో తీస్తుండటంతో ఆశ్చర్యపడ్డాను. వీఎఫ్ఎక్స్ ప్రధానం కావడంతో షూటింగ్ ఏరియాకు అంత ప్రాముఖ్యత ఉండదని నిపుణులు చెప్పారు. సినిమా ఎలా ఉంటుందో తెలియజేసే పెయింటింగ్స్‌ను నేను చూశాను. మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది’ అని కృతిసనన్ చెప్పింది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైఫ్అలీఖాన్ ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది.