“ఆదిపురుష్’ టీజర్ విషయంలో వచ్చిన విమర్శల్ని సినిమా టీమ్ మొత్తం పాజిటివ్‌గా తీసుకున్నారు. అవసరమైన మార్పులతో సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మాణాత్మకమైన సూచనల్ని తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి’ అని చెప్పింది కృతిసనన్. భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ఆమె సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నారు.
ఓంరౌత్ దర్శకుడు. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్ర టీజర్ అభిమానుల్ని నిరుత్సాహపరచింది. స్పెషల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవనే విమర్శలొచ్చాయి. దాంతో సినిమా రిలీజ్‌ను జూన్‌కు వాయిదా వేశారు. ప్రస్తుతం అధునాతన సాంకేతిక హంగులతో గ్రాఫిక్స్‌కు మెరుగులు దిద్దుతున్నారు.
ఈ విషయమై కృతిసనన్ మాట్లాడుతూ ‘టీజర్లో చూపించిన స్పెషల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేవని కొందరన్నారు. మా టీమ్ కూడా సోషల్‌మీడియా ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుంది. అందులో కొన్ని నిజాలున్నాయి. వాటి ఆధారంగా క్వాలిటీతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ‘ఆదిపురుష్’ వంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు గర్విస్తున్నా. ఈ సినిమా మా టీమ్ అందరికి పేరుప్రతిష్టల్ని తీసుకొస్తుంది’ అని పేర్కొంది.