‘ఆదిపురుష్’ చిత్రంలో జానకి పాత్రధారిణిగా కృతిసనన్ పేరు ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ చిత్రం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృతిసనన్ సన్నిహితులు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. త్వరలో ఈ భామ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టనుందని తెలిసింది. సినీరంగంలో పదేళ్ల ప్రయాణానికి చేరువవుతున్న ఈ అమ్మడు నటనతో పాటు నిర్మాణరంగంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైందని చెబుతున్నారు.
‘కృతిసనన్ కథల ఎంపిక బాగుంటుంది. చిత్ర నిర్మాణంతో పాటు వివిధ విభాగాలపై ఆమెకు మంచి పరిజ్ఞానం ఉంది. తన అభిరుచికి తగిన కథల్ని తెరపై తీసుకురావడానికి ఆమె నిర్మాతగా మారబోతున్నది. తొలుత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కొన్ని చిత్రాల్ని నిర్మిస్తాం’ అని కృతిసనన్‌కు చెందిన టీమ్ తెలిపింది. హిందీలో లుకా చుప్పీ, బరేలీ కి బర్ఫీ, మిమి వంటి విలక్షణ కథా చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది కృతిసనన్. తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.