“ఉప్పెన’ తర్వాత నేను పూర్తిస్థాయి ప్రేమకథలో నటించలేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చింది. ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నయనతార నిర్మించారు.
ఈ సందర్భంగా గురువారం కృతిశెట్టి విలేకరులతో ముచ్చటించింది. ఇది 2040లో జరిగే కథ అని, ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని చెప్పింది. ‘ఈ తరంలో డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు. కానీ ఫోన్ లేకుండా ఉండటం చాలా కష్టం. అలాంటి మనస్తత్వం కలిగిన అమ్మాయి పాత్రను పోషించాను.
భవిష్యత్తులో ప్రేమ కూడా ఇన్సూరెన్స్‌లో భాగం కావొచ్చు. ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’ అని చెప్పింది. ప్రేమ విషయంలో తాను మాత్రం సంప్రదాయ భావాల్ని ఇష్టపడతానని, ‘సీతారామం’ ‘96’ వంటి ప్రేమకథలు తనకు ఫేవరేట్ అని, ప్రేమ తాలూకు అమాయకత్వంలోనే ఓ ఆందం ఉంటుందని, ఈ తరం ప్రేమకు తాను ఏమాత్రం కనెక్ట్ కాలేనని కృతిశెట్టి చెప్పింది.