‘యాదృశ్చికంగా నా అడుగులు నటనవైపు మళ్లాయి. కాలేజ్ రోజుల్లో చిన్నచిన్న స్టేజ్ ప్లేలు చేశా. దాన్నే సీరియస్గా తీసుకుంటానని అప్పుడు అనుకోలేదు. చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించా. కానీ ఏదో వెలితి. అందుకే.. ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఈ రంగాన్ని ఎంచుకున్నా. నా తల్లిదండ్రులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజంగా మరిచిపోలేను. అలాగే.. మా గురువుగారు వైజాగ్ సత్యనంద్. నటుడిగా నాలో కాన్ఫిడెంట్ పెరగడానికి కారణం అయనే. కచ్చితంగా అందరూ గర్వపడే స్థాయికి చేరుకుంటా’ అని నమ్మకం వ్యక్తం చేశారు యువహీరో కృష్ణవంశీ. ఇటీవల విడుదలైన ‘అలనాటి రామచంద్రుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. సినిమాకు మంచి స్పందన వచ్చిందని, అవకాశాలు కూడా వస్తున్నాయని, కథలు వింటున్నానని కృష్ణవంశీ తెలిపారు. యాక్షన్ హీరోగా ఎదగడం తన డ్రీమ్ అని, నటుడిగా తానేంటో నిరూపించుకునే పనిలో ఉన్నానని కృష్ణవంశీ చెప్పారు.