బాలకృష్ణ ‘ఆదిత్య 369’ ఇటీవలే రీరిలీజై.. థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేసింది. దేశంలోనే తొలి టైమ్ ట్రావెల్ మూవీగా చరిత్ర సృష్టించిన సినిమా ‘ఆదిత్య 369’. అందుకే.. ఈ సినిమా అంటే ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అభిమానం. దీనికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ ఉంటుందని కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హీరో బాలకృష్ణ, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావులు కూడా పలు సందర్భాల్లో ‘ఆదిత్య 999’ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే.. అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వయసును దృష్టిలో పెట్టుకొని.. ఓ దశలో ఆ సినిమాను బాలకృష్ణే డైరెక్ట్ చేయాలని భావించారు. ఈ సినిమా ద్వారానే తన తనయుడు మోక్షజ్ఞను టాలీవుడ్‌కి పరిచయం చేయాలని కూడా ఆయన అనుకున్నారు.
కానీ బాలయ్యకున్న కమిట్మెంట్లు, బిజీ షెడ్యూల్స్ వల్ల.. ‘ఆదిత్య 999’ ఓ టిపిక్‌గానే మిగిలిపోయింది. అయితే.. ఎట్టకేలకు ఆ కథ సెల్యులాయిడ్ మీదుకు వెళ్లే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తున్నది. ‘ఆదిత్య 999’ బాధ్యతను దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి అప్పగించారట నందమూరి బాలకృష్ణ. ఆర్కా మీడియా పతాకంపై ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో ప్రస్తుతం క్రిష్ బిజీగా ఉన్నారట. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు అందించనున్నట్టు వినికిడి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా ఈ సినిమాతోనే ఉంటుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.