Kota Srinivasa Rao | తెలుగు సినిమా రంగంలో తాను చేయని పాత్రలే లేనన్నట్టుగా, కోట శ్రీనివాసరావు నటించిన ప్రతి క్యారెక్టర్‌కి జీవం పోశారు. కమెడియన్‌గా , విలన్ గా, ఫాదర్, తాత, అవినీతి నేత ఇలా ఏ పాత్రనైనా అవలీలగా పోషించిన కోటా అనేక తరాల తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, తన ప్రతిభతో ప్రతి సినిమాలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. తొలుత హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న కోట సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, 1983లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అమరజీవి’ లో నటించి మరింత గుర్తింపు పొందారు. ఆ తరువాత నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎస్వీఆర్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ శకం ముగిసిన తర్వాత ఆ లోటును భర్తీ చేశారు కోట.
‘డబ్బు ఖర్చు… సబ్బు ఖర్చు… నీళ్ల ఖర్చు’ అనే డైలాగ్‌తో గుర్తొచ్చే లక్ష్మీపతి పాత్ర కోట నటనకు ఒక మైలురాయి. ‘అహ నా పెళ్లంట సినిమాలో ఆయన పోషించిన పిసినారి పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచుతోంది. అదే తరహా పాత్రను ఆయన ‘ఆమె’, ‘ఆ నలుగురు’ వంటి చిత్రాల్లోనూ చేసి మెప్పించారు. 1985లో వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలో ఆయన పోషించిన మంత్రి కాశయ్య పాత్ర, కోటాని ఓ స్టార్ చేసింది. “నమస్తే తమ్మీ!” అంటూ తెలంగాణ యాసతో మాట్లాడే అవినీతి మంత్రిగా ఆయన నటన, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ‘గణేష్’ చిత్రంలో “సాంబశివుడురా నా పేరు” అంటూ గుండుతో, లెన్స్‌తో, దుర్మార్గమైన ఆరోగ్య మంత్రిగా ఆయన చేసిన నటన చూస్తే గుండెల్లో వణుకు పుట్టేది. అదే తరహా సీరియస్ షేడ్స్‌ను ఆయన ‘గాయం’ సినిమాలో ‘గదైతే నేను ఖండిస్తున్న’ అనే డైలాగ్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.
‘హలో బ్రదర్’లో తాడిమట్టయ్య, ‘మనీ మనీ’లో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే తికమక క్యారెక్టర్లు ప్రేక్షకులకు ఇప్పటికీ నవ్వులు తెస్తాయి. బాబు మోహన్‌తో కలిసి చేసిన కామెడీ సీన్లు మరొక లెవెల్ అన్నట్టుగా ఉంటాయి. కోట నటనలో హాస్యం ఒక్కటే కాదు… భావోద్వేగం కూడా ఉంటుంది. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో అల్లరి తాతగా, ‘బొమ్మరిల్లు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో మధ్యతరగతి తండ్రిగా ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.తెలుగు సినిమాలతోపాటు, ఇతర భాషల్లోనూ కోటా నటించి మంచి గుర్తింపు సంపాదించారు. మల్టీ డైమెన్షనల్ నటనతో ఆయన ఒక తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన అధ్యాయంగా మిగిలారు. కోట మరణించిన కూడా ఆయన పోషించిన పాత్రలు, పలికించిన డైలాగులు, చూపించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరకాలం నిలిచిపోతాయి.