Lokesh Kanagaraj | పైకి చెప్పడం లేదు కానీ ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ స్పీడ్ చూసిన తర్వాత చాలా మంది ఇదే చెప్తున్నారు. అసలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకైతే ఈయన తీరు అస్సలు అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఈ దర్శకుడు అప్పుడే ఇండియాను చుట్టేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు హీరోలందర్నీ క్యూలో పెడుతున్నాడు. లోకేష్‌తో వర్క్ చేయడానికి హీరోలు కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కథలన్నీ ఒకేలా ఉంటాయి కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం నెక్ట్స్ లెవల్ అంతే. అందుకే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారుతున్నాడు లోకేశ్. ఈయన సినిమాలు చేస్తున్నది తమిళంలో మాత్రమే అయినా.. అందులోని కంటెంట్ గురించి మాత్రం ఇండియా మొత్తం మాట్లాడుతుంది. తాజాగా విజయ్ హీరోగా ఈయన తెరకెక్కిస్తున్న లియో అక్టోబర్ 19న విడుదల కానుంది. మాస్టర్ లాంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తెలుగులోనూ లియోపై అంచనాలు మామూలుగా లేవు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ఏకంగా 22 కోట్లకు కొన్నారు. తెలుగులో ఓ మీడియం రేంజ్ హీరో మార్కెట్ ఇది. అయితే ఎంత పెద్ద హీరోతో అయినా.. ఆర్నెళ్లలో ఔట్ పుట్ ఇచ్చేస్తున్నారు లోకేశ్. విక్రమ్ మత్తు ఇంకా దిగకముందే లియోను దించుతున్నారు. గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నారు లోకేశ్. సాధారణంగా ఈ రేంజ్ ఉన్న స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా కూడా ఓ సినిమా పూర్తయ్యాక.. కనీసం ఆర్నెళ్లు గ్యాప్ తీసుకుంటారు. నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్ కోసం మరో ఆర్నెళ్లు తీసుకుంటారు. కానీ లోకేశ్ మాత్రం అలా కాదు.. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ లైనప్‌తో పాటు షెడ్యూల్స్ కూడా రెడీ చేస్తారు. లియో తర్వాత రజినీకాంత్‌తో సినిమా అనౌన్స్ చేశారు లోకేశ్. దాంతో పాటు ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ కూడా ప్రకటించారు ఈ దర్శకుడు.
అసలు ఇన్ని సినిమాలు ఎప్పటికి పూర్తి చేస్తాడో తెలియడం లేదు. కరెక్టుగా ప్లాన్ చేసుకుంటే రజినీ సినిమాను కూడా ఆర్నెళ్లలోనే పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు లోకేశ్. మరోవైపు టాలీవుడ్‌లోనూ ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమాలు ఉన్నాయంటూ ప్రకటించాడు లోకేశ్ కనకరాజ్. ఆయనతో పని చేయడానికి మన హీరోలు కూడా క్యూరియస్గానే ఉన్నారు. పైగా అన్నీ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే రానున్నాయి. అలాగే బాలీవుడ్లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. ఈయన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో..? అన్నట్లు 10 సినిమాలు చేసి దర్శకుడిగా రిటైర్ అవుతానని అప్పట్లో ఓ మాట చెప్పాడు లోకేశ్. మరి ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడో లేదో చూడాలి.