‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కె.కె.సెంథిల్‌కుమార్. ఆయన ఛాయాగ్రహణం అందించిన తాజా చిత్రం ‘జూనియర్’ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ సందర్భంగా శనివారం సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్‌కుమార్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
చిత్ర నిర్మాత సాయి కొర్రపాటితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో ‘ఈగ’ సినిమా చేశా. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘జూనియర్’ కథ గురించి చెప్పారు. స్టోరీలోని బలమైన ఎమోషన్స్ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. దాంతో వెంటనే అంగీకరించాను
హెవీ గ్రాఫిక్స్, సీజీ వర్క్ ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇలాంటి యూత్‌ఫుల్ ఫ్యామిలీ స్టోరీ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇటీవలకాలంలో ఫ్యామిలీ డ్రామాస్ రావడం చాలా తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా చేయడం హ్యాఫీగా అనిపించింది.
కథలోని ఎమోషన్స్ మన హృదయాల్ని కదిలించాలి. మిగతా ఎన్ని హంగులు ఉన్నా భావోద్వేగాలు లేకపోతే ఆ సినిమా వర్కవుట్ అవదు. సినిమా అంగీకరించే ముందు ఈ విషయానికి నేను అధిక ప్రాధాన్యతనిస్తా.
రాజామౌళి-మహేష్‌బాబు చిత్రానికి నేను పనిచేయడం లేదు. గతంలో కూడా ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు విక్రమార్కుడు, మర్యాద రామన్న చిత్రాలకు నేను పనిచేయలేదు. అప్పుడు గ్యాప్ వచ్చింది. ఈ విషయంలో ఎవరూ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు (నవ్వుతూ). ఆ తర్వాత మేము కలిసి పనిచేస్తాం.
దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది. దానికి ఇంకా టైముంది. కొన్ని కథల మీద వర్క్ చేస్తున్నా. ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం తెలుగులో స్వయంభూ, ఇండియన్ హౌస్ చిత్రాలు చేస్తున్నా.