Kirtan Nadagoud | సినీ పరిశ్రమలో హృదయ విదారక విషాదం చోటుచేసుకుంది. మరికొద్ది రోజుల్లో దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ నాదగౌడ కుటుంబంలో తీరని దుఃఖం నెలకొంది. కీర్తన్ నాదగౌడ, సమృద్ధి దంపతుల నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ కె. నాదగౌడ ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సోమవారం (డిసెంబర్ 15) చోటుచేసుకుంది. ఈ ఘటనతో కీర్తన్ నాదగౌడ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే సోనార్ష్ అకాల మరణం సినీ వర్గాలను కలచివేసింది. ఈ విషయం తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కీర్తన్ నాదగౌడ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
కీర్తన్ నాదగౌడ కన్నడ సినీ పరిశ్రమలో అనేక చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేశారు. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్’ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అనుభవంతోనే దర్శకుడిగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ సినిమాను అధికారికంగా ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
ఇలాంటి సంతోషకరమైన సమయంలోనే ఈ దుర్ఘటన జరగడం కీర్తన్ నాదగౌడ దంపతులకు తీరని లోటుగా మారింది. లిఫ్ట్‌లో ఇరుక్కోవడం వల్ల చిన్నారి సోనార్ష్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు చిన్నారికి నివాళులు అర్పిస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ విషాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన సంతాపం ప్రకటించారు. దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది. తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె. నాదగౌడ దుర్మరణం పాలయ్యాడు. నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి శివైక్యం చెందిన విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ పుత్ర శోకం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.