Kiran Abbavaram | టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘క’ ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’(Dada saheb phalke film festival)కు నామినేట్ అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయినట్లు సదరూ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖారున జరుగనున్న వేడుకల్లో విజేతలకు పురస్కారాలు అందించనున్నారు. చిన్న సినిమాగా వచ్చి గతేడాది అక్టోబర్ 31న బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది ‘క’ (KA Movie) చిత్రం. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..
ఓ జైలు లాంటి చీకటి గదిలో కథ మొదలవుతుంది. ఆ గది మధ్య ఓ టేబుల్. దానికి అటుఇటు కూర్చోడానికి రెండు కుర్చీలు. ఆ టేబుల్‌పై గడియారాన్ని పోలిన ఓ యంత్రం. నడినెత్తిపై లైట్.. ఇది సెటప్. హీరో వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) ఆ గదిలో బంధించి ఉంటాడు. తనెందుకు అక్కడ బంధింపబడ్డాడో తనకి అర్థం కావడంలేదు. ఇంతలో ఓ ముగ్గురు ముసుగు మనుషులు ఆ గదిలోకి ప్రవేశించారు. వారిలో మధ్యలోని ముఖ్యమైన వాడు వాసుదేవ్‌ని ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టాడు. ‘అసలు 1977లో నువ్వు కృష్ణగిరి గ్రామంలోకి ఎందుకు ప్రవేశించావ్?’ అనడిగాడు. వాసుదేవ్ చెప్పనని మొరాయించాడు. టేబుల్ మీదున్న గడియారంలాంటి యంత్రం గిర్రున తిరిగింది. దాని నుంచి వెలువడిన శక్తివల్ల వాసుదేవ్ నిదానంగా హిప్నటయిజ్ అయ్యాడు. చెప్పడం మొదలుపెట్టాడు.
1960ల్లో కథ మొదలైంది. వాసుదేవ్‌కి అప్పుడు పదేళ్లు ఉంటాయి. తనో అనాధ, అనాధ శరణాలయంలో బతుకుతుంటాడు. ‘నా’ అన్నవాళ్లు లేకపోవడంతో ఇతరులకు వచ్చిన ఉత్తరాలు చదవే చెడ్డబుద్ధిని అలవాటు చేసుకుంటాడు. ఇతరులకు వారి బంధువులు రాసిన ఉత్తరాలు చదువుతూ, తనకే ఆ ఉత్తరాలు వచ్చినట్టు ఫీలవుతుంటాడు. ఈ ఆనందం రోజూ ఉండాలని, తనో పోస్ట్‌మ్యాన్ కావాలని నిశ్చయించుకుంటాడు. ఆ అలవాటులో భాగంగా శరణాలయం వార్డెన్ ఉత్తరం చదువుతూ వార్డెన్‌కి దొరికిపోతాడు. అతను వాసుదేవ్‌ని కొట్టి, మందలించి వదిలిపెట్టేస్తాడు. ఓ రోజు వార్డెన్ దగ్గరున్న డబ్బును దొంగిలించి, శరణాలయం నుంచి పారిపోతాడు వాసుదేవ్. తన కూతురు ఆపరేషన్‌కోసం వార్డెన్ దాచుకున్న డబ్బు అది. ఆ డబ్బు పోవడంతో వార్డెన్ షాక్‌కి గురవుతాడు. ఆపరేషన్ జరగకపోవడంతో అతని కూతురు చనిపోతుంది. ఇవేమీ పారిపోయిన వాసుదేవ్‌కి తెలీదు. తాను ఆ డబ్బుతో వేరే ఊరు చేరుకొని తన ఆశయసాధన కోసం టెన్త్ వరకూ చదువుపూర్తి చేస్తాడు. కృష్ణగిరి అనే ఊళ్లో అసిస్టెంట్ పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి, ఆ ఊరు చేరుకుంటాడు. ఇక అక్కడ ఎదురైన పరిణామాలేంటి? అసలు వాసుదేవ్ ఆ జైల్లో ఎందుకు పడ్డాడు? అతడ్ని ఇంటరాగేట్ చేస్తున్న వాళ్లు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.