యువహీరో కిరణ్ అబ్బవరం నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వి.మునిరాజు దర్శకుడు. ఈ చిత్రం త్వరలో థియేట్రికల్ రిలీజ్ కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. శనివారం ఈ చిత్రంలోని ‘చిన్ని చిన్ని గుండెలోన’ అనే పాటను విడుదల చేశారు.
ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో మెలోడీ ప్రధానంగా సాగిందీ గీతం. వంశీకాంత్ రేఖన స్వరపరచిన ఈ పాటకు సనారే సాహిత్యాన్నందించారు. హరిణి ఇవటూరి, పవన్‌కల్యాణ్ ఆలపించారు. ప్రేమలోని మధురభావాలకు అద్దంపడుతూ ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వంశీకాంత్ రేఖన, నిర్మాత: కిరణ్ అబ్బవరం, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: వి.మునిరాజు.