కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న భావోద్వేగ ప్రేమకథ ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకుడు. బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ మేకర్స్ సాయిరాజేష్, ఎస్కేఎన్ నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ‘గుర్తుందా..’ అంటూ సాగే ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘సాయిరాజేష్ ఈ కథ చెప్పినప్పుడే ఇది బలంగా జనం మనసుల్లో నిలిచిపోయే సినిమా అని అర్థమైంది.
ముఖ్యంగా మణిశర్మ ఇచ్చిన ఏడు పాటల్నీ థియేటర్లలో సెలబ్రేట్ చేసుకుంటారు’ అని నమ్మకంగా చెప్పారు. ఏదో చిన్న సినిమా చేసుకుందాం అనుకున్న తనతో ఇంతటి ఎమోషనల్ మూవీని డైరెక్ట్ చేయించిన నిర్మాతలు సాయిరాజేష్, ఎస్కేఎన్లకు కృతజ్ఞతలని దర్శకుడు రవి నంబూరి అన్నారు. తన కథను తాను అనుకున్న దానికంటే అద్భుతంగా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించాడని, తను ఎంతటి ప్రతిభావంతుడో ఈ సినిమా చెప్పబోతోందని కథారచయిత, నిర్మాత సాయిరాజేష్ అన్నారు. ఇంకా నిర్మాత ఎస్కేఎన్, సంగీత దర్శకుడు మణిశర్మ , నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా మాట్లాడారు.