Kiran Abbavaram | టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య రహస్య గురువారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ బాబు ఫొటోను కూడా పంచుకున్నారు కిరణ్.ఈ ఫొటోలో బాబు సున్నితమైన కాలిని ముద్దాడుతూ కనిపించారు. ‘రాజాగారు రాణివారు’లో సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన రహస్య, కిరణ్‌లు కొంత కాలం సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపి2024లో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే కిరణ్ అబ్బవరం తండ్రైన విషయం తెలుసుకున్న అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఓ అభిమాని కిరణ్ అబ్బవరం పోస్ట్‌కి మీ ఇంటికి జూనియర్ అబ్బవరం వచ్చారంటూ కామెంట్ చేశాడు. ఇక కిరణ్ అబ్బవరం ఇంట్లోకి కొత్త సభ్యుడు రావడంతో వారి ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, రాయచోటిలో 1992 జులై 15న జన్మించిన కిరణ్, 2019లో “రాజావారు రాణిగారు” చిత్రం ద్వారా హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో నటించిన రహస్యతో ప్రేమలో పడడం, ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకోవడం, ఇక ఇప్పుడు పండంటి బిడ్డకి తండ్రి కావడం అంతా సినిమాటిక్‌గా జరుగుతుంది.
కిరణ్ అబ్బవరం గతేడాది ‘క’సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. పీరీయాడిక్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో విభిన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ మూవీ ప్రమోషన్ సమయంలో కిరణ్ తనపై ట్రోల్ చేసే వారికి గట్టిగా బదులు ఇచ్చాడు. ఇక కిరణ్ ‘కె- ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా మరో కొత్త జానర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. మరి కొద్ది రోజులలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రహస్య విషయానికి వస్తే పెళ్లైనప్పటి నుండి ఆమె సినిమాలకి దూరంగా ఉంటుంది.