విడుదలకు ముందే ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయిన సినిమా ‘కింగ్డమ్’. అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మళ్లీరావా, జర్సీ చిత్రాలతో ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టిన గౌతమ్ తిన్ననూరి కచ్చితంగా ‘కింగ్డమ్’ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటారనే నమ్మకం ఆడియన్స్‌లో బలంగా ఉంది. ఇంతకీ ఈ సినిమా విడుదల ఎప్పుడు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఈ నెల 25న ‘కింగ్డమ్’ని విడుదల చేసేందుకు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సరిగ్గా ఆ సినిమాకు ఒక్క రోజు ముందు పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను విడుదల చేస్తున్నట్టు సదరు చిత్ర మేకర్స్ ప్రకటించారు.
దాంతో ఇప్పుడు ‘కింగ్డమ్’ విడుదల మళ్లీ డైలమాలో పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘కింగ్డమ్’ని ఈ నెల 31న రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారట. అంటే.. ‘వీరమల్లు’ విడుదలైన వారం తర్వాత అనమాట. మరోవైపు ఎన్టీఆర్ ‘వార్ 2’ని కూడా ‘కింగ్డమ్’ నిర్మాతలే తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 14న ‘వార్ 2’ విడుదల కానుంది. అంటే ‘కింగ్డమ్’ విడుదలైన రెండు వారాల తర్వాత అనమాట. ఈ రెండు వారాల సమయం ‘కింగ్డమ్’కి సరిపోతుందని, ఆ తర్వాత ‘వార్ 2’పై ఫోకస్ పెట్టొచ్చని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలిసింది.