Kingdom 2 | విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ ప్రధాన పాత్రలలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం కింగ్డమ్. భారీ అంచనాల మధ్య జులై 31న విడుదల కానున్న ఈ చిత్రం జులై 31న థియేటర్స్ లో రిలీజయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్‌లేక ఇబ్బందులు పడ్డ విజయ్ దేవరకొండకి ఈ చిత్రం కొంత ఉపశమనం కలిగించింది. ఇప్పుడు కింగ్డమ్ ఊహించని ఓపెనింగ్స్‌తో థియేటర్లలో రచ్చ చేస్తుంది. విడుదలైన తొలి రోజే సినిమా మంచి వసూళ్లు సాధించడంతో టీమ్ ఆనందోత్సాహాలతో వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్ పాల్గొన్నారు.
తెలంగాణలో భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈసారి సీడెడ్‌లో సూపర్ ఫాంలో కనిపించాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజే సుమారు 50 శాతం రికవరీ సాధించిందని, ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని వివరించారు. గురువారం విడుదలైన సినిమా ఫలితంపై కొంత టెన్షన్‌గా ఉన్న విజయ్ దేవరకొండ, “ప్రొడ్యూసర్ నన్ను నమ్మాడు. ఆ నమ్మకాన్ని చూసి మాటలు రావడం లేదు” అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా “కింగ్డమ్ 2” గురించి కూడా క్లూస్ ఇచ్చారు. త్వరలోనే సీక్వెల్ ఉంటుందని, అయితే అది విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తైన తరువాతే ప్లాన్ చేస్తామని చెప్పారు. మొదటి పార్ట్ క్లైమాక్స్‌లో చూపించిన సేతు అనే పాత్రను ఓ స్టార్ హీరో చేయనున్నారని, ఆ విషయంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని నాగవంశీ తెలిపారు. మొదటి భాగంలో తక్కువ ప్రాధాన్యం కలిగిన భాగ్యశ్రీ బోర్సే పాత్రకు సీక్వెల్లో ఎక్కువ స్కోప్ ఉండబోతుందని చెప్పారు. ఈ కామెంట్స్‌తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే ఆ హీరో ఎవరనే దానిపై చర్చలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. ఆ సినిమాలో పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా మీసం పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతుండగా, సమాంతరంగా దిల్ రాజు నిర్మించే “రౌడీ జనార్దన్” అనే మరో సినిమా కూడా మొదలవుతుంది. దీనికి “రాజావారు రాణిగారు” ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు.