ప్రస్తుతం భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పానిండియా సినిమాల్లో ‘టాక్సిక్’ తొలి వరుసలో ఉంటుంది. ‘కేజీఎఫ్’ఫేం యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా కియారా తన తాజా ఇంటర్వ్యూలో ‘టాక్సిక్’ సెట్లో తన అనుభవాలను పంచుకున్నది. ‘డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ నిబద్ధత చూసి ఆశ్చర్యపోయా. టైమ్‌కి చాలా విలువ ఇచ్చేవారామె. ఒకసారి ఫోన్ చేసి.. ‘రేపు నువ్వు సెట్లోకి రాగానే పూర్తిగా పాత్రలోనే ఉండాలి. ఎలాంటి మర్యాదలు, పలకరింపులు వద్దు.
నేరుగా క్యారెక్టర్ జోన్లోకి వచ్చేయాలి’ అని సీరియస్‌గా చెప్పారు. నిజానికి నేను ఆ విధానానికి పూర్తి వ్యతిరేకం. సెట్లోకి రాగానే ముందు అందర్నీ విష్ చేయడం నాకు అలవాటు. లొకేషన్లో ఉత్సాహంగా ఉండే మనిషిని. కానీ డైరెక్టర్ మాట వినాలి కాబట్టి తను చెప్పినట్టే చేశాను’ అని గుర్తు చేసుకున్నది కియారా అద్వాణీ. ఇందులో నదియా అనే పాత్రలో కియారా నటిస్తుండగా, నయనతార గంగ పాత్రలో కనిపించనున్నది. ‘ఎలిజిబెత్’ అనే పాత్రలో హ్యూమా ఖురేషి, ‘రెబెకా’గా తారా సుతారియా, ‘మెలిసా’ పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనున్నారు.