Jagapthi Babu | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. రామబాణం మే 5న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా జగపతిబాబు మీడియాతో చిట్ చాట్ చేశాడు. రామబాణం సినిమా విశేషాలు జగ్గూ భాయ్ మాటల్లోనే..
రామబాణంలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
నేను 70కిపైగా సపోర్టింగ్ రోల్స్ చేశాను. కానీ వాటిలో ఏడెనిమిది మాత్రమే పాపులర్ అయ్యాయి. రామబాణంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. నాది చాలా పాజిటివ్ దృక్పతం కలిగిన పాత్ర. గోపీచంద్, నా పాత్రలు రామబాణంలో కీలకంగా సాగుతాయి. క్లైమాక్స్‌లో ఈ విషయం అర్థమవుతుంది. ప్రస్తుత జనరేషన్‌కు ఇలాంటి సెంటిమెంట్ స్టోరీల అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నా.
ఖుష్భూతో కలిసి పనిచేయడం ఎలా ఉంది..?
మేం చిన్నప్పటి నుంచి స్నేహితులం. అయితే మేమిద్దరం ఏ సినిమాలో కూడా నటించలేదు. మొదటి సారి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాం. చాలా సౌకర్యవంతంగా అనిపించే నటి. ఆమెతో మళ్లీ పనిచేస్తానని ఆశిస్తున్నా.
డైరెక్టర్ శ్రీవాస్ గురించి..
శ్రీవాస్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో వచ్చారు. చాలా ఇంప్రెసివ్‌గా షూట్ చేశారు. తాను ఏం కావాలనుకుంటున్నాడో అది రాబట్టుకునే వరకు చాలా కష్టపడుతుండే గొప్ప డైరెక్టర్. అన్నదమ్ములు, వారి ఎమోషన్స్ ను మరోసారి గొప్పగా చెప్పాలనుకున్నాడు.
నిర్మాతల గురించి ఏం చెప్తారు..?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తారు. ఇటీవల కాలంలో నేను పనిచేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో ఇది ఒకటి. ఓ సినిమాకు ఏం కావాలి.. దాని కోసం ఏమేం అందించాలనేది వారికి తెలుసు. నా నెక్ట్స్ సినిమా కూడా వారి ప్రొడక్షన్ హౌజ్‌లో ఉండనుంది.
మీ కొత్త సినిమాల సంగతేంటి..?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో నా నెక్ట్స్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతోపాటు పలు భారీ చిత్రాల్లో డిఫరెంట్ పాత్రలు చేస్తున్నా. బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు రావడం సంతోషంగా ఉంది. నాకు గాడ్‌ఫాదర్ లాంటి పాత్రతోపాటు గాయం సినిమా లాంటి రోల్ కూడా చేయాలనుంది.