తారాగణం: యష్, శ్రీనిధిశెట్టి, సంజయ్‌దత్, ప్రకాష్‌రాజ్, రవీనాటాండన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ
సంగీతం: రవి బస్రూర్
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్
నిర్మాత: విజయ్ కిరంగదూర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌నీల్
నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడ నటుడు యష్‌కు పాన్ ఇండియా హీరో ఇమేజ్ను తీసుకొచ్చింది. భారీ వసూళ్లతో వాణిజ్యపరంగా కన్నడ సినిమా సత్తా ఏమిటో చాటిచెప్పింది. ఈ సినిమాతో దర్శకహీరోలు ప్రశాంత్‌నీల్, యష్ తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఆవిష్కరిస్తూ కొలార్ బంగారు గనుల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ మూవీగా ‘కేజీఎఫ్’ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ‘కేజీఎఫ్-2’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సీక్వెల్ తొలిభాగం మాదిరిగానే ప్రేక్షకుల్ని మెప్పించిందా? సీక్వెల్లో ఉన్న మెరుపులు, మరకలు ఏమిటో తెలుసుకుందాం..
తొలిభాగంలో ప్రతినాయకుడు గరుడను అంతమొందించి నరాచి గోల్డ్ మైన్స్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు రాఖీభాయ్ (యష్). అక్కడ బానిసలుగా బతుకున్న కూలీల బతుకుల్లో వెలుగులు నింపుతాడు. మొదటి పార్ట్ కథ ఎక్కడ ముగిసిందో రెండో పార్ట్ కథ అక్కడే మొదలవుతుంది. తొలి భాగం తాలూకు కథ జర్నలిస్ట్ ఆనంద్ వాసిరాజు (అనంత్‌నాగ్) నరేషన్లో నడుస్తుంది. రెండో భాగాన్ని ఆయన కొడుకు విజయేంద్ర వాసిరాజు (ప్రకాష్‌రాజు) చెబుతుంటాడు. ఇక ‘కేజీఎఫ్-2’కథలోకి వెళితే… నరాచిని హస్తగతం చేసుకున్న రాఖీభాయ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. అక్కడ పనిచేసే తన మనుషులకు ఆయుధ శిక్షణ ఇప్పిస్తూ ఓ సైన్యంగా తయారుచేస్తుంటాడు. వారందరి అవసరాల్ని తీర్చుతూ ఓ దేవుడిలా మారతాడు. నరాచిలో తనకు ఎదురే లేదనుకుంటున్న తరుణంలో చనిపోయాడని భావిస్తున్న అధీరా (సంజయ్‌దత్) తెరమీదికొస్తాడు. దీంతో రాఖీభాయ్-అధీరా మధ్య పోరు ఆరంభమవుతుంది. ఇదే అదనుగా ముంబయిలో ఉండే మాఫియాడాన్ శెట్టి కూడా రాఖీభాయ్ అడ్డు తొలగించుకోవాలని పావులు కదుపుతుంటాడు. ఇంతకి అధీరా ఎలా బ్రతికొచ్చాడు? గోల్డ్ మైనింగ్ సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న రాఖీభాయ్‌ని కట్టడి చేయడానికి ప్రధాన మంత్రి రమికాసేన్ (రవీనా టాండన్) ఎలాంటి చర్యలు తీసుకుంది? దుబాయ్‌లో ఉన్న ఇయాయత్ ఖలీని రాఖీభాయ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఎన్నో ప్రతిబంధకాల మధ్య రాఖీభాయ్ ప్రయాణం ఎలా సాగింది? అన్నదే మిగతా సినిమా కథ..
తొలి భాగంలో జీరో నుంచి హీరోగా ఎదిగిన గ్యాంగ్‌స్టార్ రాఖీభాయ్ ప్రస్థానాన్ని ఆవిష్కరించారు. హీరోయిజం తాలూకు ఎలివేషన్స్, రాఖీభాయ్ పాత్ర చిత్రణలోని కొత్తదనం వల్ల మొదటిపార్ట్లోని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్ హృదయానికి హత్తుకుంది. రెండో భాగంలో కూడా దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఇదే పంథాను ఫాలో అయ్యాడు. తొలిపార్ట్‌లో రాఖీభాయ్ ఎదిగిన వైనాన్ని చూపించగా..సీక్వెల్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి రాభీభాయ్ ఏం చేశాడన్నదానిపై దృష్టిపెట్టారు? అంతర్జాతీయ స్థాయిలో రాఖీభాయ్ ఎలా ఎదిగాడనే అంశాల్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో రాఖీభాయ్ పాత్రను మరింత శక్తిసంపన్నుడిగా, రొమాంచితమైన ఎలివేషన్స్‌తో చూపించే ప్రయత్నం చేశారు. రాఖీభాయ్ ప్రతి అడుగులో పవర్ఫుల్ హీరోయిజం కనిపిస్తుంది.
ప్రథమార్థంలో రాఖీ భాయ్ శత్రువులందరిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. గతం తాలూకు నరకం నుంచి బయటపడి స్వేచ్ఛగా బ్రతికే రోజులు రావడంతో అక్కడి ప్రజలు రాఖీభాయ్‌ని దేవుడిలా కొలుస్తుంటారు. అధీర ఆగమనంతో కథలో కీలకమైన మలుపు చోటుచేసుకుంటుంది. అధీర చేతిలో గాయపడ్డ రాఖీభాయ్ దుబాయ్‌కు వెళ్లడం, అక్కడ ఇనాయత్ఖలీని కలుసుకోవడం కథలో ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో అసలు రాఖీభాయ్ లక్ష్యమేమిటో స్పష్టమవుతుంది. అయితే ద్వితీయార్థంలో కథా గమనం కాస్త పట్టుతప్పింది. ముఖ్యంగా పోరాట ఘట్టాల్ని పునరావృతం చేశారనే భావన కలుగుతుంది. అదే సమయంలో రాఖీ-అధీరా మధ్య పోరాటం కూడా అంతగా ఆకట్టుకోదు. ప్రీ ైక్లెమాక్స్ ఎపిసోడ్లో ప్రధానమంత్రి రమికాసేన్తో రాఖీ భాయ్ తలపడటం ఉత్కంఠను పంచుతుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించవు. పార్లమెంట్ భవనంలోకి వెళ్లి ప్రధానమంత్రిని హెచ్చరించడం వంటి సీన్స్ ఏమాత్రం లాజిక్కు అందవు. హీరోయిక్ ఎలివేషన్‌ను పీక్ స్టేజీలోకి తీసుకుపోయే భాగంలోనే ఆ సీన్స్‌ను పెట్టారనుకోవచ్చు. పార్లమెంట్ ఎపిసోడ్ పూర్తి నాటకీయంగా కనిపిస్తుంది. కథా గమనంలో ల్యాగ్ వస్తుందనుకునే ప్రతి సందర్భంలో తల్లి సెంటిమెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్‌నీల్ సఫలీకృతుడయ్యారు. ఇలాంటి గ్యాంగ్‌స్టర్ చిత్రానికి మదర్సెంటిమెంట్ ఓ ఆయువుపట్టులా నిలిచింది.
ప్రీ ైక్లెమాక్స్ ఎపిసోడ్ మినహాయిస్తే ద్వితీయార్థంలో ఎలాంటి మలుపులు కనిపించవు. కొన్ని సన్నివేశాల్ని సాగతీశారనే భావన కలుగుతుంది. అయితే ముగింపు మాత్రం బాగుంది. పతాకఘట్టాల్ని తల్లి సెంటిమెంట్‌తో జడ్జ్ చేసి చూపించడం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య తొలిభాగంలో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. ద్వితీయార్థంలో మాత్రం ఇద్దరి మధ్య బంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ైక్లెమాక్స్ ఎపిసోడ్ హైలైట్‌గా చెప్పొచ్చు. ఈ సినిమాకు మూడోభాగం కూడా ఉంటుందనే హింట్‌తో కథను ముగించడం ఆసక్తినిగా పెంచింది. ‘వాడు చనిపోతే మోసుకుపోవడానికి నలుగురు మనుషులు అవసరం లేదు..ఎందుకంటే పుట్టినప్పటి నుంచి సమాధి వరకు వాడు ఒక్కడిగానే అడుగులు వేశాడు’ వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. తొలిభాగంలో మాదిరిగానే సీక్వెల్లో కూడా పవర్ఫుల్ డైలాగ్స్ వినిపించాయి.
రాఖీభాయ్‌గా యష్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో తనదైన ైస్టెల్ కనబరిచాడు. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో యష్ నటన కట్టిపడేస్తుంది. కథానాయిక పాత్రకు ద్వితీయార్థంలో ప్రాధాన్యత దక్కింది. కథను నరేట్ చేసే విజయేంద్ర వాసిరాజుగా ప్రకాష్‌రాజ్ తనదైన అభినయంతో మెప్పించాడు. అధీరా పాత్రలో సంజయ్‌దత్ చక్కటి విలనీ పండించారు. ఆయన ఆహార్యం భీతిగొలిపే విధంగా ఉంది. ప్రధానమంత్రి రమికాసేన్‌గా రవీనాటాండన్ మంచి నటనతో మెప్పించింది. సీబీఐ అధికారిగా రావు రమేష్ తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికంగా అత్యున్నత విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా కేజీఎఫ్ గోల్డ్మైన్స్లోని విజువల్స్ కట్టిపడేస్తాయి. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఫీల్‌ను చక్కగా ఎలివేడ్ చేసింది. ఓ రకంగా బీజీఎమ్ ఈ సినిమాకు పెద్దబలమని చెప్పొచ్చు. ద్వితీయార్థంలో కథాగమనం కాస్త మందగించడం..ఆసక్తికరమైన మలుపులు లేకకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది.
తొలిపార్ట్లోని ఉద్వేగాలు కొరవడినప్పటికీ..హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఎలివేట్ చేయడం, మదర్సెంటిమెంట్ ఈ సీక్వెల్లో ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తాయి. ద్వితీయార్థంపై మరింత దృష్టిపెడితే బాగుండేది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి ఉన్న అంచనాల దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. బాక్సాఫీస్ బరిలో ‘కేజీఎఫ్-2’ మరోమారు సంచలనాలకు సిద్ధమైందని చెప్పొచ్చు.