బంజారా వర్గానికి చెందిన ఓ యువకుడి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్'(కేసీఆర్). ‘జబర్దస్త్’ఫేం రాకేష్ హీరోగా నటించి, స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకుడు. అనన్య కృష్ణన్ కథానాయిక. శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేశారు. కేశవచంద్ర రమావత్ (కేసీఆర్), అతని మరదలు మధ్య చిన్ననాటి స్నేహాన్ని ఆవిష్కరిస్తూ ఈ ట్రైలర్ సాగింది.
తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి స్పూర్తి పొందిన యువకుడు కేశవచంద్ర రమావత్గా రాకేష్ నటించాడు. ‘నా షార్ట్నేమ్ కేసీఆర్’ అని కేశవచంద్ర రమావత్ సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. తన ఊరు మేలు కోరుతూ ఓ లక్ష్యంతో హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్ ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాడనేది ఈ సినిమా కథ అని మేకర్స్ తెలిపారు.
‘ఈ సినిమాకు కథకుడు కూడా రాకేషే. అద్భుతమైన కథ రాశాడు. కథ వినగానే చేస్తానని చెప్పాను. సినిమాటోగ్రఫీ కూడా నేనే చేశాను. ఈ సినిమాకు పనిచేసిన వారంతా ప్రాణంపెట్టి పనిచేశారు’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన దర్శకుడు సాయిరాజేష్, నటుడు శివబాలాజీ, నటి అనసూయ , నటుడు శివారెడ్డి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.