Kerala Crime Files S2 | మలయాళంలో మొట్టమొదటి ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ తన రెండవ సీజన్‌తో తిరిగి రాబోతోంది. జియో హాట్‌స్టార్‌లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సీజన్ 2 కు ‘ది సెర్చ్ ఫర్ సీపీఓ అంబిలి రాజు ‘ (The Search for CPO Ambili Raju) అనే క్యాప్షన్ పెట్టారు.
ట్రైలర్ చూస్తుంటే, తిరువనంతపురం జిల్లాకు చెందిన ఐదుగురు పోలీస్ అధికారులు, పన్నెండు మంది కానిస్టేబుళ్లు ఒకేసారి సస్పెండ్ అవుతారు. అయితే, ఆ పోలీసులు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? వారంతా ఎవరి కోసం వెతుకుతున్నారు? చివరికి వాళ్లు దొరికారా లేదా? అన్నది ఈ వెబ్ సిరీస్ కథగా తెలుస్తోంది.
సీజన్ 2లో పోలీస్ వ్యవస్థలోని చీకటి కోణాలను, అవినీతిని చూపించబోతున్నట్లు సమాచారం. మొదటి సీజన్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అజు వర్గీస్, లాల్ ఈ సీజన్లోనూ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. వీరితో పాటు, ‘రాకెట్ బాయ్స్’, ‘కన్నూర్ స్క్వాడ్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన అర్జున్ రాధాకృష్ణన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సీజన్లో హరిశ్రీ అశోకన్, ఇంద్రన్స్, రంజిత్ శేఖర్, సంజు సానిచెన్, సురేష్ బాబు, నవాస్ వల్లక్కున్ను, నూరిన్ షెరీఫ్, జియో బేబీ, షిబ్లా ఫారా, బిలాస్ చంద్రహాసన్ వంటి ప్రముఖ నటీనటులు భాగం కాబోతున్నారు. అహ్మద్ కబీర్ ఈ సీజన్‌కు దర్శకత్వం వహించగా, బహూల్ రమేష్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఈ సిరీస్ మంకీ బిజినెస్ బ్యానర్‌పై నిర్మించబడింది. సీజన్ 2 త్వరలో జియో హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.