నటీనటులు: కీర్తీ సురేష్, సుహాస్, తాళ్లూరి రామేశ్వరి, బాబు మోహన్, శత్రు, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, విష్ణు ఓఐ, శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకత్వం: ఐవీ శశి
రచన: వసంత్ మరింగంటి
నిర్మాత: రాధిక లావు, పృథ్వీ గణేష్ వేగిరాజు
మ్యూజిక్: స్వీకర్ అగస్తి
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఒకవైపు సినిమాలు చేస్తునే మరోవైపు ఓటీటీలకు ఒకే చెబుతుంది నటి కీర్తి సురేష్. ఇప్పటికే అక్క అనే వెబ్ సిరీస్ చేస్తున్న ఈ అమ్మడు మరోవైపు ఉప్పు కప్పురంబు అంటూ ఒక ఓటీటీ సినిమా చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేరుగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రానికి ఐవీ శశి దర్శకత్వం వహించాడు. నటుడు సుహాస్ కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది చూసుకుంటే..
కథ
ఈ సినిమా కథ మొత్తం చిట్టి జయపురం అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి మరణంతో చిట్టి జయపురం ఊరి పెద్దగా బాధ్యతలు తీసుకుంటుంది అపూర్వ (కీర్తి సురేశ్). అయితే అపూర్వకి ఇది సంతోషం ఇచ్చేలోపే ఊరికి విచిత్రమైన సమస్య వస్తుంది. ఊరిలో శ్మశానం కొరత ఎదురవుతుంది. ఆ ఊరిలో మొదటగా చనిపోయిన నలుగురికి మాత్రమే శ్మశానంలో చోటు ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని ఊరి పెద్ద అయిన అపూర్వ ముందుకు తీసుకువెళతాడు కాటికాపరి చిన్న (సుహస్). ఈ విషయం తెలిసిన అపూర్వ ఊరి కోసం ఏం చేసింది. అపూర్వకి కాటికాపరి చిన్న ఎలా సహాయపడ్డాడు. శ్మశానం సమస్య ళ్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
యువ దర్శకులు ఈ మధ్య కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి మరో కొత్త కథనే ఈ చిత్రం. చనిపోయిన తర్వాత శ్మశానం కొరత అనే సామాజిక సమస్యను వినోదంతో మేళవించి తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు ఐవీ శశి కొంతవరకు సఫలమయ్యారు. కీర్తి విషయానికి వస్తే.. ఇప్పటివరకు గ్లామర్, డీ-గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఈ భామ చాలా రోజుల తర్వాత
ప్రత్యేకమైన పాత్రలో నటించింది. అపూర్వ అనే గ్రామ పెద్దగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు శ్మశానం సమస్య ఎదురవ్వడం. ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించామని అనుకునేలోపు నలుగురు చనిపోవడంతో అది మరింత తీవ్రమవ్వడం ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే ఈ సినిమాలో దర్శకుడు శ్మశానం చుట్టూ ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను చూపించారు.
కీర్తి సురేష్ గ్రామ పెద్దగా బాగా నటించినప్పటికీ, ఆమె పాత్రలో కొన్ని తికమక పెట్టే సన్నివేశాలున్నాయి. ఒక సీన్లో అమాయకంగా కనిపించిన కీర్తి, మరో సీన్లో చాలా తెలివైన అమ్మాయిగా వ్యవహరించడం లాజికల్‌గా అనిపించదు. కొన్ని సీన్లలో ఆమె అతిగా స్పందించినట్లు కూడా అనిపిస్తుంది. అయితే కీర్తి నటన మాత్రం చాలా బాగుంది. సుహాస్ పాత్ర చాలా స్థిరంగా, ఎక్కడా తడబాటు లేకుండా ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్, కీర్తిల మధ్యే సాగుతుంది. కథలో అక్కడక్కడా చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.
నటినటులు
ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా బలంగా ఉంది, దానికి తగ్గట్టుగానే ఆమె అద్భుతంగా నటించింది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలు చాలా రొటీన్‌గా అనిపించినా, అపూర్వ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాటి కాపరి పాత్రలో సుహాస్ కూడా మెప్పించాడు, ఎక్కడా తగ్గలేదు. ‘నిజం’ సినిమాలో మహేష్‌బాబుకు అమ్మగా నటించిన తాళ్లూరి రామేశ్వరికి ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర లభించింది. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని అవకాశాలు రావచ్చని చెప్పొచ్చు. బాబు మోహన్, శత్రు కూడా తమ పాత్రల మేరకు మెప్పించారు.
సాంకేతికంగా
ఈ మూవీకి సంగీతం మరింత బలాన్ని చేకుర్చింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు.
రేటింగ్ : 2.5/5