కమర్షియల్ చిత్రాలతో పాటు మహిళా ప్రధాన కథాంశాల్లో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నది కీర్తి సురేష్. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘రఘుథాత’. ‘కేజీఎఫ్’ ‘కాంతార’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్ ఈ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్నది. సుమన్ కుమార్ దర్శకుడు. అఫీషియల్ పోస్టర్‌ను ఆదివారం సోషల్‌మీడియాలో విడుదల చేశారు.
‘ఇంటిదగ్గరే విప్లవం మొదలవుతుంది’ అనే క్యాప్షన్‌తో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ ‘బలమైన వ్యక్తిత్వం కలిగిన మహిళ కథ ఇది. కట్టుబాట్లను ప్రశ్నిస్తూ సమాజంలో చైతన్యానికి కృషి చేసే స్ఫూర్తివంతమైన మహిళగా కీర్తి సురేష్ పాత్ర ఆకట్టుకుంటుంది’ అన్నారు.