‘దసరా’ సినిమా అద్భుత విజయాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నది చిత్ర కథానాయిక కీర్తి సురేష్. ఈ సినిమాలో తాను పోషించిన పల్లెటూరి అమ్మాయి వెన్నెల పాత్ర నటనాపరంగా కొత్త కోణాల్ని పరిచయం చేసిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ “దసరా’ విజయం మాటల్లో వర్ణించలేని అనుభూతినిస్తున్నది. వెన్నెల పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. గతంలో నేను కొన్ని రస్టిక్ అండ్ రియలిస్టిక్ కథల్లో నటించాను.
అయితే తెలుగులో తొలిసారి ఈ తరహా క్యారెక్టర్ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథ చెప్పినప్పుడే నా కెరీర్లో నిలిచిపోయే సినిమా అవుతుందనుకున్నా. ‘దసరా’ చిత్రం కెరీర్‌పరంగా నాకు కొత్తదారిని చూపించింది’ అని పేర్కొంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ‘భోళాశంకర్’ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నది. తమిళంలో సైరన్, రివాల్వర్ రాణి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.