Deepfake | తన పేరుతో ఆన్లైన్లో సర్కులేట్ అవుతున్న AI మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా బాధిస్తున్నాయని కీర్తి తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
“AI మార్ఫింగ్ చిత్రాలు నా మనసుకి చాలా బాధ కలిగించడమే కాకుండా.. చాలా విసుగు పుట్టిస్తున్నాయి. ఈ కృత్రిమ మేధస్సుతో క్రియేట్ నకిలీ చిత్రాలు ఎంత నమ్మేలా ఉన్నాయంటే వాటిని చూసినప్పుడు నిజంగానే నేను అలా ఫోజు ఇచ్చానా? అని తనకు తాను ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని కీర్తి పేర్కొన్నారు. ఇది AI సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తుందని కీర్తి తెలిపారు. AI సాంకేతికత సామర్థ్యాలు నానాటికీ పెరుగుతున్నాయని వీటిని నియంత్రించడం కష్టంగా మారుతోందని కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా తమ ఇమేజ్‌లను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని. ఈ సమస్య కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదని సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉండే ఎవరికైనా ఇది ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని కీర్తి హెచ్చరించారు.
ఇక కీర్తి సురేష్ ఆవేదనకు మద్దతుగా నటి ఆండ్రియా జెరెమియా కూడా AI వల్ల కలిగే నష్టాల గురించి మాట్లాడారు. నటులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా AI సమస్యగా మారుతోంది. AI మన కోసం పనిచేయాలి, అంతేకానీ మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఆమె అభిప్రాయపడ్డారు. రష్మిక మందన్న, సమంత వంటి పలువురు నటీమణులు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ లేదా మార్ఫింగ్ చిత్రాల బారిన పడ్డారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా దీనిపై గళం విప్పడం, AI దుర్వినియోగంపై మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.