Keeravani | సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం ‘వారణాసి’ పై ఏదో ఒక ఆసక్తికర సమాచారం బయటకు వస్తూనే ఉంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో విడుదల చేసిన నాలుగు నిమిషాల గ్లింప్స్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కలగలిపిన విజువల్స్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా చివర్లో మహేశ్ బాబు త్రిశూలంతో శక్తివంతమైన అటిట్యూడ్లో కనిపించిన షాట్‌కు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది.
ఈవెంట్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ రామాయణం, మహాభారతం తనకు ఎంతగానో నచ్చే ఇతిహాసాలేనని తెలిపారు. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన రాజమౌళి“ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి ముందు రామాయణంలోని ముఖ్య ఘట్టాన్ని నేను తెరకెక్కిస్తానని ఎన్నడూ అనుకోలేదు. కానీ రాముడి వేషంలో మహేశ్ తొలి రోజు సెట్లోకి అడుగుపెట్టినప్పుడు నాకే గూస్బంప్స్ వచ్చాయి” అని చెప్పుకొచ్చారు.అంతేకాక, శ్రీరాముడిగా మహేశ్ బాబు లుక్ ఉన్న ఫోటోను కొన్ని రోజుల పాటు తన మొబైల్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నానని, తర్వాత ఎవరైనా చూస్తారన్న భయంతో తొలగించానని రాజమౌళి సరదాగా అన్నారు. ఇక ‘వారణాసి’లో హనుమంతుడి పాత్రను ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఇంతకుముందు మాధవన్ ఈ సినిమాలో మహేశ్ బాబు తండ్రి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపించింది. అయితే తాజాగా ఆయన హనుమంతుడి గెటప్‌లో కనిపించబోతున్నారనే ప్రచారం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉన్నట్లు వెల్లడించారు. గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలో కీరవాణి ఈ విషయాన్ని తెలియజేశారు. సంగీతం ఎవరు ఊహంచని స్థాయిలో ఉంటుందని అన్నారు. అభిమానులు సంగీతాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అంతకు మించి ఇంకా ఏం చెప్పదలచుకోలేదు అంటూ కీరవాణి కామెంట్ చేశారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘సంచారి’.. ‘రణ కుంభ’ అనే సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకినిగా తెరమీదకి రానున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు.