Kayadu Lohar | ప్రముఖ నటి కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. శరీరానికి ఎలా విశ్రాంతి అవసరమో మనసుకు కూడా అలాంటి బ్రేక్ కావాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు వెల్లడించింది. కొంతకాలం స్క్రీన్కు దూరంగా ఉంటూ నిజ జీవితంతో మమేకం కావాలని, తనతో తాను ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
ఈ విషయంపై కయాదు ఇన్‌స్టాలో పోస్ట్ పెడుతూ.. “సోషల్ మీడియా నుంచి చిన్న అడుగు వెనక్కి వేస్తున్నాను. కొన్నిసార్లు మనం శరీరానికి ఇచ్చే విశ్రాంతి మనసుకు కూడా అవసరం. నేను కాస్త నెమ్మదించి, డిస్కనెక్ట్ అవ్వాలని, స్క్రీన్కు అవతల ఉన్న జీవితంతో, నాతో నేను ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నాను” అని రాశారు. ఇన్నిరోజులు నాకు మద్దతుగా నిలిచి, ప్రోత్సహించిన, దయ చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, సందేశాలు నాకు ఎంతో విలువైనవి. నేను కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను, కానీ ఏవైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే నా టీమ్ ఈ ఖాతా ద్వారా పంచుకుంటుంది. అందరూ సంతోషం, దయతో ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలో కలుద్దాం అని పేర్కొన్నారు.
సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఫంకీతో అలరించిన ఈ భామ తెలుగులో నాని సరసన ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా దర్శకుడు మరియప్పన్ చిన్న తెరకెక్కిస్తున్న తమిళ్ హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.