ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్.ఎస్ దర్శకుడు. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఏపీలోని అమలాపురం కిమ్స్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన గీతావిష్కరణ కార్యక్రమంలో ఈ సినిమాలోని తొలి గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఐకానిక్ డైలాగ్ అయిన ‘కత్తందుకో జానకీ..’ని పల్లవిలోని తొలి పదంగా కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని ఆర్.ఆర్.ధృవన్ స్వరపరిచారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రధాన పాత్రధారుల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ గీతం సాగింది.
వీరి అలవాట్లను, రిలేషన్స్‌ని ప్రస్తావిస్తూ సాగిన ఈ గీతంలో తల్లిదండ్రులు వారిని తరుముతూ ‘కత్తందుకో జానకి’ అనడం ఈ పాటలో హైలైట్. అందర్నీ అలరించేలా, బాధల్నీ మరపించేలా, థియేటర్లలో హాయిగా నవ్వులు పూయించేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అమలాపురం ఎంపీ జి.ఎం.హరీష్ బాలయోగి అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ ఎస్.జె, సమర్పణ: బన్నీ వాస్, నిర్మాణం: సప్తఅశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటైర్టెన్మెంట్స్.