2024లో వచ్చిన ‘మేరీ క్రిస్మస్’ తర్వాత కత్రినాకైఫ్ నటించలేదు. 2021లోనే నటుడు విక్కీ కౌశల్‌ని వివాహం చేసుకున్న ఆమె.. గత ఏడాది నవంబర్ 7న ఓ బాబుకి జన్మనిచ్చింది. అప్పట్నుంచీ నటనకు దూరంగా ఉంటూ మాతృత్వాన్ని ఆశ్వాదిస్తున్నది. అయినా ఆమె క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రస్తుతం కత్రినా కంబ్యాక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త ప్రస్తుతం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. సామాజిక రుగ్మతలను, వాస్తవిక ప్రపంచంలోని వెలుగు నీడలను ఆవిష్కరిస్తూ 2001లో మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ‘చాందినీ బార్’ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే.
ప్రతికూల పరిస్థితుల ప్రభావం వల్ల బార్ డాన్సర్‌గా మారిన విధివంచితురాలిగా ఆ సినిమాలోని టబూ నటనకు జనం జేజేలు పలికారు. గత ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. అప్పట్నుంచీ ఈ సినిమాకు చెందిన తదుపరి సమాచారం కోసం ‘చాందినీ బార్’ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ‘సెక్షన్ 375’ ఫేం అజయ్ బహల్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు బీటౌన్‌లో వార్త బలంగా వినిపిస్తున్నది. అలాగే టబూ కూడా ఇందులో భాగం కానున్నదట. అయితే.. సదరు నిర్మాణ సంస్థ నుంచి మాత్రం దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇది నిజం కావాలని కత్రినా అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.