Karuppu | తమిళ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన కరుప్పు సినిమా రిలీజ్ రోజే అనూహ్యంగా ఆగిపోవడం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో షోలు క్యాన్సిల్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు తమిళనాడులో ప్రత్యేక అనుమతులు కూడా లభించాయి. ముఖ్యంగా ఉదయం 9 గంటల స్పెషల్ షోలకు అనుమతి రావడం విశేషంగా మారింది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ స్వయంగా ఈ స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
అయితే అన్ని ఏర్పాట్లు పూర్తైన తర్వాత కూడా సినిమా విడుదల ఆగిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఫైనాన్స్ సంబంధిత సమస్యల కారణంగానే ‘కరుప్పు’ రిలీజ్ నిలిచిపోయినట్లు సమాచారం. అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభం కావాల్సి ఉండగా అవన్నీ చివరి నిమిషంలో రద్దయ్యాయి. అదే విధంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం షోలు కూడా పడకపోవడంతో థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సూర్యకు ఈ సినిమా కీలకంగా మారింది. ‘కరుప్పు’తో ఆయన బలమైన కమ్‌బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశించారు. కానీ రిలీజ్ రోజే ఇలాంటి సమస్యలు తలెత్తడంతో సినిమా బిజినెస్, ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక విజయ్ – త్రిష సంబంధంపై గత కొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సినిమా మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు త్రిష హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి సమయంలో విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష నుంచి వస్తున్న మొదటి సినిమా విడుదల ఆగిపోవడం తమిళనాట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ‘కరుప్పు’ సినిమా ఈరోజే విడుదల అవుతుందా? లేక కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారా? అన్న దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.