Karthikeya 3 | ఈ మధ్య సీక్వెల్ చిత్రాలు వరుసగా సెట్స్ మీదకు వెళుతున్నాయి. ఆల్రెడీ సలార్-2, పుష్ప-2, దేవర-2, కల్కి-2 ఇలా ఎన్నో సినిమాలు సీక్వెల్, ప్రీక్వెల్లు కొనసాగుతున్నయి. అయితే తాజాగా ఆ లిస్ట్‌లో చేరిన చిత్రం కార్తికేయ. నిఖిల్ సిద్దార్థ్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బొగ్గారపు శ్రీనివాస్ నిర్మించారు. అయితే ఈ చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రం సీక్వెల్‌ను ప్లాన్ చేశారు చందు మొండేటి, నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తీకేయ-2ను అభిషేక్ అగర్వాల్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది.
అయితే కార్తికేయ-2 నిర్మించడానికి నేనే వారికి హక్కులు ఇచ్చానని, ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్, ఫ్రాంచైజీ హక్కులు తన వద్దనే వున్నాయని అంటున్నాడు నిర్మాత బొగ్గారపు శ్రీనివాస్. మరోవైపు కార్తికేయ-3 హక్కులు తమ వద్ద వున్నాయని అప్పట్లో ప్రకటించారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.
దీనిపై గురువారం బొగ్గారపు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ మొదటిభాగం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబరులో విజయదశమి పర్వదినాన కార్తికేయ-3ను అధికారికంగా ప్రకటిస్తాను అంటున్నారు. కార్తికేయ-2 సంచలన విజయం సాధించడంతో వచ్చే ప్రీక్వెల్పై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే వారి అంచనాలకు అందుకునేటట్లుగా కథ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దీంతో పాటు తను డివోషనల్ టచ్ వున్న ఓ కథతో హనుమంతుడి ప్రేరణతో యతి అనే సినిమాను, శివుడి స్పూర్తితో మహాయోగి అనే మరో డివోషనల్ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే ఈ నిర్మాత ఇచ్చిన ఈ ప్రకటనతో హీరో నిఖిల్, దర్శకుడు, చందు మొండేటి, కార్తికేయ-2 నిర్మించిన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.