Sathyam Sundaram | తమిళ నటుడు కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Aravindha Swamy) ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). 96 ఫేం ప్రేమ్ కుమార్ సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదల అయ్యింది. ఎన్టీఆర్ దేవరకు పోటిగా వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా థియేటర్లో ఉన్నప్పుడే మూవీ నుంచి 20 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తొలగించిన సన్నివేశాలను ఓటీటీలో అయిన విడుదల చేస్తారు అని ప్రేక్షకులు ఎదురుచూడగా.. నిరాశే ఎదురైంది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీలో నుంచి డిలీట్ చేసిన వీడియోను నెట్ఫ్లిక్స్ తాజాగా పంచుకుంది. ఈ వీడియోలో జల్లికట్టు బ్యాన్ చేసిన అనంతరం తమిళ ప్రజలు ఎలా ఆవేదన చెందారు అంటూ ఈ వీడియోలో కనిపిస్తుంది.
Silarukku vilayattu. Silarukku vazhippaadu. 🐂🔥 Neenga kaathutrundha deleted scene ippo vandhaachu 🥳 Watch Meiyazhagan, only on Netflix! #MeiyazhaganOnNetflix pic.twitter.com/f1V3D1TpG7
— Netflix India South (@Netflix_INSouth) November 3, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సత్యమూర్తి అలియాస్ సత్యం(అరవిందస్వామి).. మూలాలను, బంధాలను ప్రేమించే మనిషి. పుట్టింది, పెరిగింది గుంటూరు మంగళగిరికి దగ్గర్లో ఉన్న ఉద్దండరాయునిపాలెం. ఆ ఊరున్నా, తాను పెరిగిన ఇల్లాన్నా, ఆ గాలి అన్నా సత్యమూర్తికి ప్రాణం. తాను యుక్తవయసులో ఉన్నప్పుడే బంధువుల మోసం వల్ల సత్యం కుటుంబం ఇంటిని కోల్పోతుంది. ఇక ఆ ఊరులో ఉండలేక పెట్టేబేడా సర్దుకొని సత్యం కుటుంబం వైజాగ్ వెళ్లి స్థిరపడుతుంది. అక్కడే 30ఏండ్లు గడిచిపోతాయి. అన్నేండ్లు గడిచినా సొంతూరి జ్ఞాపకాలు మాత్రం సత్యాన్ని వదలవ్. ఓ రోజు సత్యం ఇంటికి పెళ్లి కబురు వస్తుంది. తన బాబాయి కూతురు పెళ్లి. ఉద్దండరాయునిపాలెంలో. తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఊర్లో తనకి బాబాయి, ఆయన కూతురు తప్ప ఆత్మీయులెవరూ లేరనేది సత్యం భావన.
అందుకే.. పెళ్లికి వెళ్లి ఒక్కరాత్రిలో తిరిగొచ్చేయాలనుకుంటాడు. గిఫ్ట్ తీసుకొని ఉద్దండరాయునిపాలెం వెళ్లి, కల్యాణమండపం కోసం వెతుకుతుండగా.. అతనికి ‘బావా..’ అని ఆప్యాయంగా పలకరిస్తూ ఓ వ్యక్తి(కార్తీ) తారసపడతాడు. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతూ సత్యాన్ని పెళ్లి మండపానికి తీసుకెళ్తాడు. నిజానికి అతనెవరో, అతని పేరేంటో కూడా సత్యానికి తెలీదు. ఆ విషయం తెలిస్తే ఎక్కడ ఫీలవుతారో అని తాను కూడా మొహమాటం కొద్దీ తెలిసిన వాడిలా ప్రవర్తిస్తూ ఎలాగొలా మేనేజ్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి అతివాగుడు, మితిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం అతడ్ని నసగాడు, జిడ్డుగాడు అనుకుంటాడు. ఎలాగొలా వదిలించేసుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఒక్కరాత్రిలో వెళ్లిపోవాలనుకున్న వాడు కాస్తా.. అతని వల్లే ఇంకో రాత్రి, అతని ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. ఆ ఒక్కరాత్రిలో అతనేంటో సత్యానికి అర్థమవుతుంది. అతను ఓ తెల్లకాగితం లాంటి మనిషి అని తెలుసుకుంటాడు. ప్రేమను పంచడం తప్ప మరొకటి తెలీని గొప్ప మనిషి అని అర్థం చేసుకుంటాడు. మనుషుల్లోనే కాదు, జంతువుల్లో, విషసర్పాల్లోనూ మానవత్వాన్ని చూసే గొప్ప వ్యక్తిత్వం అతనిదని తెలుసుకుంటాడు. మరి వీరిద్దరి ప్రయాణం చివరికి ఏ మజిలికి చేరింది? తనెవరో తన పేరేంటో సత్యం ఎలా తెలుసుకున్నాడు? ఆ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగితా కథ.