బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేకపోయాననే లోటు తనలో ఇప్పటికీ ఉండిపోయిందని అన్నారు. సినిమాలపై ఉన్న మక్కువతో చదువును మధ్యలోనే ఆపేయడం పట్ల ఆమె తాజాగా విచారం వ్యక్తం చేశారు. కేవలం 19 ఏళ్ల వయసులో, 2000 సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ సరసన ‘రెఫ్యూజీ’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టడంతో పదకొండవ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తన వ్యక్తిగత అనుభవం దృష్ట్యా, తన కుమారులు ముందుగా చదువును పూర్తిగా ముగించుకున్న తర్వాతే తమకు ఇష్టమైన రంగాల వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక భారతదేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు యూనిసెఫ్ తనను సంప్రదించినప్పుడు, తన విద్యాభ్యాసం అసంపూర్తిగా మిగిలిపోయిందనే వెలితి కారణంగానే తాను ఆ ఉద్యమంతో మానసికంగా మరింతగా కనెక్ట్ అయ్యానని తెలిపారు. హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరీనా, ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటిస్తున్న డైరా (Daayra) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.