Karan Johar | బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత వీడియోను షేర్ చేసి, దానిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో బాబిల్ బాలీవుడ్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు స్పందించారు. తాజాగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ వీడియోపై స్పందించారు.
కరణ్ జోహార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాబిల్ వీడియో చూసినప్పుడు ఒక తండ్రిగా తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు. “బాబిల్ బాధను చూసి చాలామందిలాగే నేను కూడా ఒక తండ్రిగా చాలా బాధపడ్డాను. నాకు కూడా ఒక కొడుకు, కూతురు ఉన్నారు,” అని కరణ్ తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.. మే 4వ తేదీన బాబిల్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ బాలీవుడ్ ఒక ఫేక్ ఇండస్ట్రీ అని తెలిపాడు. అంతేకాకుండా, అనన్యా పాండే, అర్జున్ కపూర్ షనయ కపూర్, సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జుయల్, ఆదర్శ్ గౌరవ్, అరిజిత్ సింగ్ వంటి పలువురు ప్రముఖ నటీనటులను “మర్యాదలేని” వారిగా పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో బాబిల్ పోస్ట్ చేసిన కాసేపటికే తొలగించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేస్తూ, బాబిల్ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన క్షేమంగానే ఉన్నారని తెలిపారు.